బీఏఎస్‌ఎఫ్ ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ప్రారంభం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్‌ఎఫ్ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.
గ్లోబల్ నెట్‌వర్క్‌లో కీలకం..
ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్‌హాఫెన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న బీఏఎస్‌ఎఫ్ డిజిటల్ హబ్‌ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.
ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్‌కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్‌లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
నియామక ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్‌ప్లేస్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్ అండ్ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!


