భారతదేశం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి దిక్సూచిగా మారుతోందని ఎన్‌ఎక్స్‌టీ ఫౌండేషన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ‘భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025-26’ పేరుతో విడుదలైన విశ్లేషణలో గడిచిన ఏడాది కాలంలో దేశం సాధించిన 101 చారిత్రాత్మక విజయాలను ఆవిష్కరించింది. డిజిటల్ విప్లవం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, మౌలిక సదుపాయాల కల్పన నుంచి హరిత ఇంధనం వరకు భారత్ వృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని చెప్పింది.
జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
ఎన్‌ఎక్స్‌టీ నివేదిక ప్రకారం.. 2025లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 4.18 ట్రిలియన్ డాలర్ల నామమాత్రపు జీడీపీతో జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2 శాతం బలమైన వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే వేగం కొనసాగితే అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నివేదిక విశ్లేషించింది.
విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 1.15 ట్రిలియన్ డాలర్లను దాటాయి. దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిబింబించేలా పలు కీలక సూచీలు రికార్డులను సృష్టించాయని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేని విధంగా రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ పొదుపు సంస్కృతి పెరగడంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.80 లక్షల కోట్లను దాటింది.
ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
నివేదికలోని కొన్ని అంశాలు..
యూపీఐ నెలవారీ లావాదేవీల విలువ రూ.21 లక్షల కోట్లు దాటడం దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యాప్తికి అద్దం పడుతోంది.
ఒక బిలియన్ మార్కును దాటిన ఆధార్ అప్‌డేషన్‌లు ప్రభుత్వ సేవలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేయడంలో పారదర్శకతను పెంచాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన (చీనాబ్ బ్రిడ్జ్) పూర్తి కావడం భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వందే భారత్ రైళ్లు రవాణా ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.
జాతీయ రహదారుల విస్తరణతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి సరఫరా గొలుసు బలోపేతమైంది.
ఇస్రో నిర్వహించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ విజయవంతం కావడంతో అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటు దిశగా భారత్ కీలక అడుగు వేసింది.
చైనాకు ప్రత్యామ్నాయంగా ‘గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా ఎదిగే క్రమంలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తోంది.
సౌర, పవన, హైడల్ పవర్ రంగాల్లో భారత్ అసాధారణ వృద్ధిని కనబరిచింది.


