ధరల హెచ్చుతగ్గులతో ఎల్‌టీవీ మారే అవకాశం
ఎల్‌టీవీకి మించి ధర పతనమైతే తక్షణం సర్దుబాటు
అదనపు గోల్డ్ పెట్టడమో, డబ్బులు చెల్లించటమో చేయాలి
ఈ రెండూ చేయలేకపోతే వాటి వేలం తప్పదు
అందుకే ఎల్‌టీవీ 60 శాతం మించకపోతేనే నయం
తక్కువ కాలానికైతేనే బంగారం రుణాలు బెటర్
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.
వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్‌్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...
రుణ పరిమితులు..
⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్‌టీవీ)గా చెబుతుంటారు.
⇒ ఎల్‌టీవీకి సంబంధించి ఆర్‌బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది.
⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు.
⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్‌టీవీ అమలవుతుంది.
⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్‌టీవీ 75 శాతం మించకూడదు.
అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు.
ఉన్నట్టుండి ధరలు పతనమైతే..?
⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు.
⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది.
⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్‌బీఐ విధించిన ఎల్‌టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే.
⇒ లేదంటే ఎల్‌టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది.
⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది.
⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు.
బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది.
⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్‌్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది.
⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు.
⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది.
⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్‌లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్‌బీఎఫ్‌సీ కోరుతుంది.
వడ్డీ రేట్లు – చార్జీలు
⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి.
⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్‌బీఎఫ్‌సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి.
⇒ ఎన్‌బీఎఫ్‌సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్‌టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్‌లు– ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి.
⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు.
⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది.
⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తీసుకుంటాయి.
బంగారం విలువ మదింపు ఎలా..?
‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు.
బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్‌టీవీని నిర్ణయిస్తారు.
ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.
ఇలా చేస్తే బెటర్..
⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి.
⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్‌్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్‌లు, ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలను పరిశీలించొచ్చు.
రుణ కాల వ్యవధులు..
⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్‌లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి.
⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.


