ఎఫ్‌డీ కన్నా బెటర్‌ గురూ.. | Overnight and Liquid Funds are better options in stock market | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ కన్నా బెటర్‌ గురూ..

Mar 16 2026 4:04 AM | Updated on Mar 16 2026 4:12 AM

Overnight and Liquid Funds are better options in stock market

స్వల్ప కాలానికైతే ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ బెటర్‌

స్టాక్‌ మార్కెట్లో అవకాశం కోసం వేచి చూసేవారిక్కూడా

తాత్కాలికంగా నిధులు పార్క్‌ చేయటానికివి మంచి సాధనాలే

బ్యాంకు వడ్డీతో పోలిస్తే రాబడి ఎక్కువ.. రిస్కూ తక్కువే

ఈ ఫండ్స్‌ నిర్వహణ చార్జీలు కూడా అతి తక్కువ స్థాయిలోనే

ఎప్పుడు కావాలన్నా ఎగ్జిట్‌ కావచ్చు... చార్జీలుండవు  

ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లన్నింటిదీ ఒడిదుడుకుల దారే. మన మార్కెట్లదీ అదే తీరు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్‌ టారిఫ్‌లు రోజుకో టర్న్‌ తీసుకుంటూ ఇన్వెస్టర్లను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇపుడేమో పశ్చిమాసియా సంక్షోభం దావానలంలా చుట్టేస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఆరంభించిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో రోజురోజుకూ చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై కూడా తీవ్రంగానే ఉంటోంది. గరిష్ఠ స్థాయిల నుంచి చూస్తే మన మార్కెట్లు ఇప్పటికే దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. మరి ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్న మదుపరులు ఇపుడేం చేయాలి?  

సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు కాస్త కిందికి వచ్చాక కొద్దికొద్దిగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లటమే మంచిదని నిపుణులు చెబుతారు. మరి అలా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎక్కడుంచాలి? సేవింగ్స్‌ ఖాతాల్లో అయితే వడ్డీ ఏమీ రాదు. ఎఫ్‌డీల్లో అయితే బ్రేక్‌ చేస్తే వచ్చేది తక్కువ. ఇక మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో అయితే స్వల్ప కాలానికి పెద్దగా రాబడులేమీ రావు. దీనికి నిపుణులు చెబుతున్న సమాధానమే ఓవర్‌నైట్, లిక్విడ్‌ మ్యూచ్‌వల్‌ ఫండ్లు. వార్షికంగా 6–7 శాతం రాబడినిస్తూ... తక్కువ ఛార్జీలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకోగలిగే అవకాశం ఉండటమే వీటి ప్రత్యేకత. స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయటానికి వేచి చూసే వారే కాదు... స్వల్ప కాలానికి తమ డబ్బుల్ని ఎక్కడైనా ఉంచాలనుకునే వారందరికీ ఇవి అత్యుత్తమ పెట్టుబడి సాధనాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి కనక వీటిలో రిస్కూ తక్కువే.

 

ఓవర్‌నైట్‌.. లిక్విడ్‌ ఫండ్స్‌.. 
ఈ రెండూ భిన్నమైన ఫండ్స్‌. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ కేవలం ఒక్క రోజు మెచ్యూరిటీ ఉండే డెట్‌ సాధనాల్లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఆ విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో అత్యంత సురక్షితమైన కేటగిరీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ప్రధాన ప్రత్యేకతలేమిటంటే... వడ్డీ రేట్ల మార్పులపరంగా చాలా తక్కువ రిసు్క. అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వ్యవధి వరకు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఇవి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిధిలో ఉంటాయి. ఇక లిక్విడ్‌ ఫండ్స్‌ని తీసుకుంటే ఇవి 91 రోజుల వరకు మెచ్యూరిటీలు ఉండే డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌తో పోలిస్తే కాస్తంత ఎక్కువ రాబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దివారాల నుంచి కొద్ది నెలల వ్యవధి వరకు షార్ట్‌ టర్మ్‌ పెట్టుబడులకు ఇవి అనువైనవి.

రాబడి ఇలా.. 
సాధారణంగా వడ్డీ రేట్ల సైకిల్‌ను బట్టి రాబడులు మారుతుంటాయి. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ విషయం తీసుకుంటే వార్షికంగా సుమారు 5– 6 శాతం రాబడినిస్తాయి. అదే లిక్విడ్‌ ఫండ్స్‌ అయితే సుమారు 6–7 శాతం స్థాయిలో ఉంటుంది. అయితే కచి్చతంగా ఇంత రాబడులే వస్తాయని లేదు కానీ, స్వల్పకాలిక వడ్డీ రేట్లను బట్టి ఇవి ఉంటాయి.  

ఎవరికి అనువైనవి 
స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేసేందుకు సన్నద్ధమవుతున్నవారు, ఈక్విటీల్లో  పెట్టుబడులు పెట్టడానికి ముందు తమ దగ్గర ఉన్న నగదును ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అలాగే, స్వల్పకాలికంగా, కొద్ది నెలల వ్యవధిలో అవసరం పడే మిగులు డబ్బును కూడా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉపయోగించుకోదల్చుకునే నిధులను కూడా కొందరు ఇన్వెస్టర్లు, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచుతారు.

ఇందులోనూ రిసు్కలు ఉంటాయి.. 
ఈ తరహా పెట్టుబడుల్లో రిస్కులు తక్కువగా ఉంటాయే తప్ప పూర్తి రిస్క్‌– ఫ్రీగా మాత్రం ఉండవు. వీటిల్లో ప్రధానంగా పొంచి ఉండే రిసు్కలను చూస్తే.. 
వడ్డీ రేట్లలో మార్పులు: స్వల్పకాలిక వడ్డీ రేట్లు బట్టి రాబడులు హెచ్చుతగ్గులకు లోను కావచ్చు.  
క్రెడిట్‌ రిస్కు (లిక్విండ్‌ ఫండ్స్‌లో): కొన్ని లిక్విడ్‌ ఫండ్స్, కార్పొరేట్‌ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇలాంటి వాటిలో పరిమిత స్థాయిలో క్రెడిట్‌ రిస్కు ఉంటుంది. 
ట్యాక్సేషన్‌: పన్నులపరంగా చూస్తే ఇన్వెస్టర్‌ ఆదాయ శ్లాబ్‌ని బట్టి క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది.

ఏం చేయొచ్చంటే.. 
ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిపుణులు మూడు సింపుల్‌ రూల్స్‌ సూచిస్తున్నారు. అవేంటంటే.. 
⇒  రెగ్యులర్‌ ప్లాన్లు కాకుండా డైరెక్ట్‌ ప్లాన్లు తీసుకుంటే చార్జీల మోత తగ్గుతుంది. 
⇒  ఇన్వెస్ట్‌ చేయడానికి ముందే వ్యయ నిష్పత్తిని చూసుకోవాలి. 
⇒  మాటిమాటికీ ఎంట్రీ, ఎగ్జిట్‌ చేయకుండా ఉంటే ఎగ్జిట్‌ లోడ్‌ భారాలు తగ్గుతాయి.  

⇒  అత్యంత నాణ్యమైన పోర్ట్‌ఫోలియో ఉండే ఫండ్స్‌ని ఎంచుకోవాలి. 
⇒  ఇంకా ఎక్కువ ఈల్డ్‌పై అత్యాశతో నాసిరకం ఫండ్స్‌ని ఎంచుకోకూడదు. 
⇒  స్వల్పకాలిక అవసరాల కోసమే ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలి. 
  దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగా పరిగణించకూడదు.

ఖర్చులూ చూసుకోవాలి .. 
సాధారణంగా ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ అనేవి చౌకైన పెట్టుబడి సాధనాలే అయినప్పటికీ, కొన్ని చార్జీలు ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. 
వ్యయ నిష్పత్తి: స్కీమును నిర్వహించేందుకు ఫండ్‌ హౌస్‌ వార్షికంగా విధించే ఫీజును ఎక్స్‌పెన్స్‌ రేషియోగా వ్యవహరిస్తారు. ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో ఇది ఏడాదికి 0.6 నుంచి 0.25 శాతం శ్రేణిలో, లిక్విడ్‌ ఫండ్స్‌లో 0.8 నుంచి 0.40 శాతంగా శ్రేణిలోను ఉంటుంది. ఈ ఫీజును ఆటోమేటిక్‌గా ఫండ్‌ రిటర్నుల్లో నుంచి డిడక్ట్‌ చేస్తారు కనక ఇన్వెస్టర్లు విడిగా చెల్లించనక్కర్లేదు.

ఈ చార్జీలు సెబీ పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలను 0.30 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉన్న లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే వార్షికంగా సుమారు రూ. 3,000 చార్జీ వర్తిస్తుంది. అయితే మనం ఎన్ని రోజులు ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఉంచితే అన్ని రోజులకే చార్జీలు వర్తిస్తాయి.  

ఎగ్జిట్‌ లోడ్‌: పెట్టుబడులను సత్వరం రిడీమ్‌ చేసుకుని, వైదొలిగితే కొన్ని ఫండ్‌లు కొంత ఎగ్జిట్‌ లోడ్‌ని వసూలు చేస్తాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ విషయాన్ని చూస్తే, మొదటి రోజు రిడీమ్‌ చేసుకుంటే సుమారు 0.007 శాతం, రెండో రోజైతే 0.0065 శాతం.. అలా 7 రోజుల తర్వాత జీరో స్థాయికి లోడ్‌ తగ్గుతుంది. చాలా మటుకు ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లో సాధారణంగా ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. 

బ్రోకరేజ్‌ లేదా లావాదేవీ ఫీజులు: కొన్ని ప్లాట్‌ఫాంలు లేదా డి్రస్టిబ్యూటర్ల ద్వారా ఫండ్స్‌ తీసుకుంటే కొంత ట్రాన్సాక్షన్‌ చార్జీలు వర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చాలా మటుకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు ఇలాంటి ఫీజుల బాదరబందీ లేకుండా డైరెక్ట్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి.  
ట్యాక్సేషన్‌: ఈ ఫండ్స్‌ నుంచి రాబడులపై పన్నులు వర్తిస్తాయి. ఇటీవల పన్ను విధానాల్లో మార్పుల అనంతరం, ఇన్వెస్టర్‌ ఆదాయ పన్ను శ్లాబ్‌ బట్టి స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తోంది.  

స్టాక్‌ మార్కెట్లు ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు, కరెక్షన్లకు లోనవుతున్నాయి. ఇప్పటికే కొంత వరకూ మార్కెట్ల నుంచి ఎగ్జిట్‌ అయిన వారు, ఇంకా కొంత ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్‌ చేసి, బీపీ తెచ్చుకోవడం కంటే డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భావిస్తున్నారు. మరి బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలపై 2.5 – 4 శాతం వడ్డీ రేటే ఉంటోంది. అందుకే వీరు ఎంట్రీ, ఎగ్జిట్‌ రెండూ సులభంగా ఉండే ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ను ఆశ్రయించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement