డాక్టర్‌ ఏఐతో తస్మాత్‌ జాగ్రత్త! | AI no better than other methods for patients seeking medical advice | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఏఐతో తస్మాత్‌ జాగ్రత్త!

Feb 17 2026 5:47 AM | Updated on Feb 17 2026 5:47 AM

AI no better than other methods for patients seeking medical advice

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్‌ గైడెన్స్‌) డిజిటల్‌ యాప్‌లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో అవి చేసే సిఫార్సులు ఒక్కోసారి పెద్దపెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కాలూనని రంగమంటూ ఏదీ లేదు. చట్టాలూ,  సాఫ్ట్‌వేర్, విద్యా, వినోదంతో పాటు ఆఖరికి లక్షలాది మెడికల్‌ కేసుల అనుభవంతో వైద్య విద్య, చికిత్సల్లో కూడా అది పాలుపంచుకుంటోంది. ఇక చైనాలాంటి దేశాలైతే ఏఐతో నడిచే క్లినిక్‌లూ, హాస్పిటళ్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. 

మిగతా రంగాలెలా ఉన్నప్పటికీ... వైద్యరంగంలో మాత్రం ఏఐతో కొన్ని తప్పులూ, పొరబాట్లు జరుగుతున్నాయనీ, ఇవి ఆందోళన గొలిపేలా ఉన్నాయంటూ డాక్టర్లు, మెడికల్‌ ప్రొఫెషన్‌లో ఉన్న నిపుణులు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ పేషెంట్లు తమంతట తామే ఏఐకు తమ సమస్య చెప్పుకుని ఆ మేరకు వైద్య సలహా పొందితే అది ఆందోళనకరంగా పరిణమించేందుకు అవకాశాలు లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. 

టర్కీ (తుర్కియా) రాజధాని అంకారాలోని ఒక హాస్పిటల్‌కు వచ్చిన ఒక పేషెంట్‌ తాలూకు కేస్‌స్టడీతో ఒక సంఘటన వెలుగుచూసింది. అదేమిటంటే... ఆ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్‌ సెమ్‌ అక్సోయ్‌ అనే డాక్టర్‌ దగ్గరికి కౌమార వయస్సులో ఉన్న ఓ పద్ధెనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. అతడికి కాలిలో క్యాన్సర్‌ గడ్డ ఉందని నిర్ధారణ అయ్యాక తన కేసు వివరాలను ‘ఏఐ’కి సంబంధించిన చాట్‌ జీపీటీకి తెలిపి తనకు సలహా ఇవ్వాలంటూ కోరాడు.

 అంతే... ‘‘నువ్వు ఐదేళ్లకు మించి బతకవు’’ అంటూ ఏఐ సమాధానమిచ్చింది. ఈ సమాచారం ఆ కుర్రాడిని ఎంతగా ఆందోళనపరిచి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. కానీ ఓ సర్జికల్‌ ఆంకాలజిస్టూ, ఓ ΄్లాస్టిక్‌ సర్జన్‌ నిర్వహించిన సర్జరీల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు... ‘‘ఇప్పుడు నీలోంచి క్యాన్సర్‌ తొలగిపోయినట్టే’’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. 

అయితే మళ్లీ అదే అబ్బాయి కొన్ని వారాల తర్వాత డాక్టర్‌ అక్సోయ్‌కు మరోసారి ఫోన్‌ చేశాడు. ఈసారి వచ్చిన ఫోన్‌ సందేశంలోని సందేహమేమిటంటే... ‘‘నాకు తరచూ దగ్గు వస్తోంది. అంటే మొన్నటి క్యాన్సర్‌ ఇప్పుడు ఊపిరితిత్తులకు సోకిందంటారా?’’ అని అతడు ప్రశ్నించాడు. అయితే డాక్టర్లు అతడి ఊపిరితిత్తులను పూర్తిగా పరీక్షించాక తేలిందేమిటంటే అతడికి క్యాన్సర్‌ ఏమాత్రం లేదు. అయితే... ఆ పిల్లాడు ఈమధ్య సిగరెట్లు తాగడం మొదలుపెట్టడమే అతడి దగ్గుకు కారణమని తేలింది. 

‘‘ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయాలంటూ కేవలం లక్షణాలను మాత్రమే చూడకూడదు. అతడికి ఆ లక్షణాలు కనిపిస్తున్న సందర్భాలనూ పరిశీలించాలి. ఆ యువకుడు ఇటీవల పొగతాగడం మొదలుపెట్టినందువల్ల దగ్గు వచ్చిందని తేలింది. వైద్యవిజ్ఞాన సమారమంతా ఓ దట్టమైన అడవి అయితే... ఇలా అరకొర పరిజ్ఞానంతో అందులో తిరగడమన్నది దారీతెన్నూ తెలియకుండా అందులో తప్పిపోవడం లాంటిదం’’టూ డాక్టర్‌ అక్సోయ్‌ వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా ‘ఏఐ’ సంస్థలకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ఇలాంటి అనుభవాల తర్వాత... ఏఐ అడగాల్సిన ప్రశ్నలను నమోదు చేస్తూ కృత్రిమ మేధ మరింత సమర్థంగా, పరిపుష్టంగా పనిచేసేలా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధ ఎప్పటికీ ఓ డాక్టర్‌ / మెడికల్‌ ప్రొఫెషనల్‌కు మంచి ప్రత్యామ్నాయం కాబోదంటూ ఆయన తెలిపారు. 

ఇక్కడ ఈ టర్కిష్‌ అబ్బాయి ఉదంతం రెండు అంశాలను సూచిస్తోంది. మొదటిది... ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు... తాము హాస్పిటళ్ల వరకూ వెళ్లాల్సిన శ్రమ తప్పడం కోసం అలాగే తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెక్నాలజీ ఆధారిత సలహాల మీద ఎలా ఆధారపడుతున్నారనే అంశం. ఇక రెండోది... ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు తమకున్న పరిజ్ఞానంతో సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో తెలపడం కోసం ఈ టర్కీ అబ్బాయి ఉదంతమే ఒక తార్కాణం.

మేర దాటుతున్న మేధ... 
ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని మెడికల్‌ యాప్స్‌ తమ నైతిక పరిధులను దాటుతున్నాయి. ఉదాహరణకు ‘యురేకా హెల్త్‌’ అనే ఓ యాప్‌ తనను తాను  ‘‘ఆల్‌ ఇన్‌ వన్‌ హెల్త్‌ కంపేనియన్‌’గా ప్రకటించుకుంది. అంటే... ఆరోగ్యం విషయంలో అన్ని వ్యాధుల  నిపుణుడూ తానే అయిపోయి ఆరోగ్య సమాచారాన్ని తెలుపుతానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. 

అయితే ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ మాత్రం కొంత సంయమనం పాటిస్తూ... ‘‘ఇది కేవలం తగిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. తాను వ్యాధి నిర్ధారణగానీ లేదా చికిత్సగానీ చేయడానికి తగనం’’టూ’’ స్పష్టం చేస్తోంది. కానీ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థవాళ్లు మాత్రం ‘మీకు మీరే మీ డాక్టర్‌’ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. అలాగే ‘‘ఆస్క్, డయాగ్నోజ్, ట్రీట్‌’’ అనే మరో సైట్‌ వాళ్లు మరికాస్త ముందుకెళ్లి ‘‘మా ఐఏ వ్యాధి నిర్ధారణా చేసేస్తుంది. వాడాల్సిన మందుల్ని సూచిస్తూ ప్రిస్క్రిప్షన్‌  కూడా రాసేస్తుంది. 

ఈ ప్రపంచంలోని హాస్పి టల్స్‌లో వాస్తవంగా మీకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో దాన్ని ఇక్కడే మీకు సూచిస్తుంది’’ అంటూ గొప్పలకు పోతున్నారు. అయితే... రాయిటర్స్‌ సంస్థలో వచ్చిన వార్తల వల్ల... ‘‘యురేకా హెల్త్‌’’ యాప్‌ కారణంగా జరిగిన అనర్థాలను తెలుసుకున్న తర్వాత ‘ఆపిల్‌’ సంస్థ సదరు యాప్‌ను తమ స్టోర్‌నుంచి తొలగించింది. అంతే కాదు... ఏ సమాచారం ఆధారంగా; ఏ పద్ధతుల ద్వారా; ఏయే అంశాల సహాయంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఆ నిర్ధారణకు వస్తున్నారో స్పష్టంగా తెలపాలంటూ యాప్‌ను అభివృద్ధి చేసే నిపుణులకు స్పష్టమైన సూచనలు చేసింది.

మెడికల్‌ యాప్స్‌!
ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో గూగుల్‌ లేదా ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే మెడికల్‌ యాప్‌ల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి అవి ఎలాంటి వ్యాధి నిర్ధారణా చేయకూడదు. అయినప్పటికీ వాటిని ఆశ్రయించి... తమ సమస్య ఏమిటో తెలుసుకోవడమన్నది చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. నిజానికి ఏఐ ఎలాంటి వ్యాధినిర్ధారణా (డయాగ్నోజ్‌) చేయకూడదు. కానీ యూఎస్‌ ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) సంస్థ నియమాల ప్రకారం... ప్రజల  ప్రాథమిక అవగాహన కోసమే సమాచారం తెలిపే సందర్భాల్లో ఆ చాట్‌బాట్‌లు ఎవరి అనుమతులూ తీసుకోనక్కర్లేదు. అందుకోసమే ‘‘తాము డాక్టర్‌కు ప్రత్యామ్నాయం కానేకాదనీ,వ్యాధిని నిర్ణయించడంలో విషయంలో  తాము చేసేది ‘తుది నిర్ధారణ’ కాదం’’టూ స్పష్టంగా సూచన (డిస్కె›్లయిమర్‌) చేస్తుంటాయి. 

– యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement