అధ్యయన ఫలితాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు...
మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని వివరిస్తూ హెచ్చరించడం ఓ రకమైతే, అందుకు భిన్నంగా ఓ చిట్కా ద్వారా కూడా మద్యపాన పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. ది అడిక్టివ్ బిహేవియర్స్ వేదికగా ఈ ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది.
దాదాపు 8,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొనగా వారిని వేర్వేరు గ్రూపులుగా విభజించి, మద్యపానం గురించిన వివిధ ప్రకటనలను, సందేశాలను చూపించారు. అలాగే ‘మద్యపానం అనేది క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందనే అవగాహన కలిగించడంతో పాటు మద్యం వల్ల కలిగే పలు నష్టాలను విశదీకరించారు. మద్యం అతిగా సేవించడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు. గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చిత్తవైకల్యం (డిమెన్షియా) లతో పాటు అకాల మరణ ప్రమాదం కూడా పొంచి ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7 శాతం అకాల మరణాలకు ఆల్కహాల్ వినియోగం కారణంగా తేలింది.
‘‘ఇలాంటి అంశాలతో పాటు మద్యం క్యాన్సర్ కారకమని చాలా మందికి తెలియదు. మద్యపాన ప్రియులకు తెలియజేయవలసిన ముఖ్యమైన సమాచారం ఇది‘ అని ఆస్ట్రేలియాలోని ది జార్జ్ ఇన్సి్టట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కు చెందిన ఆర్థికవేత్త వినియోగదారు మనస్తత్వవేత్త సైమోన్ పెటిగ్రూ అన్నారు. అయితే ఇలాంటి అవగాహన కలిగించడం అనేది పరిష్కారంలో ఒక భాగం మాత్రమే, ఈ వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య సంబంధ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి మనం వారికి ఇతర ఆలోచనలను కూడా ఇవ్వాలి‘ అని ఈ పరిశోధన సందర్భంగా పెటిగ్రూ అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగానే సీరియస్ ప్రమాదాలతో పాటు మరికొన్ని తేలికపాటి మార్గాలను కూడా సూచించారు.
అలాంటి వాటిలో ఒక చిట్కా బాగా ప్రభావం చూపిందని వారు గుర్తించారు. ‘తీసుకుంటున్న ఆల్కహాల్ గురించిన సమాచారాన్ని నిర్ధిష్ట ఆచరణాత్మక చర్యతో పాటుగా వారు తీసుకుంటున్న పానీయాల విశేషాలు, అలాగే వాటి సంఖ్యను లెక్కించడం వల్ల వారు తీసుకునే మద్యం పరిమాణం తగ్గుతుందని మేం కనుగొన్నాం‘ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏతావాతా వీరు చెబుతోంది ఏమిటంటే... లెక్కా గిక్కా ఏం లేకుండా పెగ్గుల కొద్దీ విస్కీలు, బ్రాందీలు, సీలాలకు సీసాలు బీర్లు తాగేసేవారికి... వారు తాగుతున్న మద్యం పరిమాణాన్ని లెక్కించి తెలియజెప్పడం అనేది మద్య పాన తీవ్రతను తగ్గిస్తుంది అని.


