యాదాద్రి భువనగిరి జిల్లా: మనం ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించిన 24 గంటల గడియారంను మాత్రమే చూశాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న మల్లేశం తన అద్భుతమైన ఆలోచనతో ఒకే సారి 176 దేశాలకు సంబంధించిన సమయాన్ని ఒకేదగ్గర చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. గతంలో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని రూపొందించిన మల్లేశం తాజాగా ప్రపంచ గడియారంను తయారుచేసి తన నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాడు.
గతంలో కలియుగ కేలండర్..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో పున్న భారతమ్మ, పిచ్చయ్యలది సాధారణ చేనేత కుటుంబం. వారి మొదటి సంతానమైన మల్లేశం చేనేత వృత్తిలో రాణిస్తూనే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం హయత్‌నగర్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నాడు. విద్యార్థి దశనుంచే గణితంతోపాటు సామాజిక చైతన్యం, రచనా వ్యాసంగంలో ఆసక్తిగల మల్లేశం సాధారణ జీవనానికి భిన్నంగా సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలనే తలంపుతో తన ఆలోచనలకు పదును పెట్టాడు. గతంలో కలియుగ కేలండర్‌ను, కలియుగ పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేశాడు. మేధావుల ప్రశంసలు పొందాడు. 1,200 సంవత్సరాల ఐరిష్ కేలండర్‌ను ఆవిష్కరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. తాజాగా 176 దేశాలకు సంబంధించిన సమయాలను ఒకేసారి చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. ఈ గడియారంలో చూపించే సమయం ఆధారంగా విదేశాల్లో ఉన్న తమ వారి పనులకు ఆటంకం కలగకుండా మాట్లాడటం వీలవుతుంది.
భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు
ప్రపంచంలో ఎవరూ చేయని దాన్ని చేయాలనేది నా సంకల్పం. అదే సంకల్పంతో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని తయారు చేశాను. తాజాగా 176 దేశాలకు సంబంధించిన ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాను. భవిష్యత్‌లో మరిన్ని కొత్తకొత్త ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక.
– పున్న మల్లేశం ఆవిష్కర్త


