‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు | Moving Into New World Of Unpredictability’: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Feb 11 2026 1:37 PM | Updated on Feb 11 2026 2:45 PM

Moving Into New World Of Unpredictability’: Rahul Gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్థిరత్వం నుండి తీవ్రమైన అస్థిరత వైపు వేగంగా  పయనిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సంబంధాలను గమనించకుండా.. ఆర్థిక ప్రణాళికలు రచించడం సాధ్యం కాదని రాహుల్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న అలజడులు భారత ఆర్థిక వ్యవస్థపై, దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. 

ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేను రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ, అందులో తాను గమనించిన రెండు అత్యంత లోతైన అంశాలను సభకు వివరిస్తున్నానని అన్నారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి శక్తులు సవాలు చేస్తున్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. ఇక రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు  అని అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని రాహుల్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని  రాహుల్‌ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని రాహుల్  అన్నారు. ప్రపంచమంతా అస్థిరమైన, ఊహించని కొత్త ఒరవడిలోకి మారుతోందని విశ్లేషించారు. లోక్‌సభలో అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, డాలర్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్‌ సూచించారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం  తదితర అంతర్గత సమస్యలతో పాటు, ప్రపంచ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలని రాహుల్‌ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement