స్పీకర్‌ను తొలగించాలి | Opposition moves no-confidence motion against Speaker Om Birla | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ను తొలగించాలి

Feb 11 2026 3:27 AM | Updated on Feb 11 2026 3:27 AM

Opposition moves no-confidence motion against Speaker Om Birla

ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం 

ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు 

లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసు 

118 మంది విపక్ష ఎంపీల సంతకం 

సంతకం చేయని టీఎంసీ ఎంపీలు 

మార్చి 9న సభ ముందుకు తీర్మానం?

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిర్లాను స్పీకర్‌ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం నోటీసిచ్చింది. రాజ్యాంగంలోని 94–సి ఆర్టీకల్‌ కింద లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌ సింగ్‌కు దాన్ని అందజేసింది. ‘‘సభా వ్యవహారాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తిగా ఏకపక్షంగా, విపక్షాల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా స్పీకర్‌ వంటి రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు’’అని ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత గౌరవ్‌ గొగోయ్, ఆ పార్టీ చీఫ్‌ విప్‌ కె.సురేశ్, విప్‌ మొహ్మద్‌ జావెద్‌ విపక్షాల తరఫున మంగళవారం మధ్యాహ్నం సెక్రెటరీ జనరల్‌కు నోటీసు అందజేశారు. 

ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌ పదవి నుంచి తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ‘‘సభలో పలుమార్లు విపక్ష సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతించలేదు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని పూర్తి కూడా చేయనివ్వలేదు. స్పీకర్‌ వివక్షాపూరిత ధోరణికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. విపక్ష నేతను సభలో అసలు మాట్లాడనివ్వనే లేదు. ఫిబ్రవరి 4న ఒక బీజేపీ ఎంపీ మాజీ ప్రధానులపై అత్యంత అభ్యంతరకరంగా మాటల దాడి చేసేందుకు స్పీకర్‌ అనుమతించారు. పైగా అలా చేసినందుకు ఆయనను కనీసం ఒక్కసారైనా మందలించలేదు.

ఇలాంటి ప్రవర్తనను అలవాటుగా మార్చుకున్న సదరు సభ్యునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్‌ పట్టించుకోలేదు’’అని నోటీసులో ఎంపీలు ఆరోపించారు. పలువురు కాంగ్రెస్‌ సభ్యులు సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి ‘అనూహ్య చర్య’కు దిగాలని భావించినట్టు కచ్చితమైన సమాచారం తన వద్ద ఉందని స్పీకర్‌ చేసిన ప్రకటనను కూడా వారు ప్రస్తావించారు. ‘‘స్పీకర్‌ చేసిన ఈ ఆరోపణలు పూర్తి నిరాధారం. అంతేగాక కాంగ్రెస్‌ ఎంపీల పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయి. 

పార్లమెంటరీ పద్ధతులను, నియమ నిబంధనలను పరిరక్షించాల్సిన స్పీకరే ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేసేందుకు నిండు సభను వాడుకోవడం దారుణం. ఇది రాజ్యాంగబద్ధ పదవిని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా విపక్ష సభ్యులను స్పీకర్‌ పలుమార్లు అడ్డుకున్నారు’’అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్ష సస్పెండ్‌ చేయడం తదితరాలను కూడా అవిశ్వాస తీర్మానానికి కారణాలుగా వారు పేర్కొన్నారు. ఈ తీర్మానం మార్చి 9న సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్టు లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. 

రెండోసారి నోటీసు! 
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు యోచిస్తున్నట్టు సోమవారం ఉదయమే వార్తలు రావడం తెలిసిందే. దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని అనంతరం విపక్ష నేతలు తెలిపారు. మంగళవారం ఉదయమే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో విపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పీకర్‌పై నోటీసివ్వాలని ఈ సందర్భంగా వారంతా నిర్ణయించారు. అనంతరం చివరి ప్రయత్నంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజుతో విపక్ష నేతలు భేటీ అయి తమ డిమాండ్లపై మరోసారి చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన లేదంటూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. అయితే తేదీని తప్పుగా పేర్కొనడంతో సాయంత్రం దాన్ని వెనక్కు తీసుకుని మరో నోటీసు సమర్పించారు. 

సంతకం చేయని రాహుల్‌! 
అవిశ్వాస తీర్మానం నోటీసుపై పలు పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు విపక్షాలు తెలిపాయి. వారిలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ సభ్యులున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ) ఎంపీలు సంతకాలు చేయకపోయినా అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీలు మద్దతు తెలిపాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నోటీసుపై సంతకం చేయకపోవడం గమనార్హం. విపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా సంతకం చేయలేదని సమాచారం!

తీర్మానంపై తేలేదాకా విధులకు దూరం
స్పీకర్‌ ఓం బిర్లా నిర్ణయం 
కాంగ్రెస్‌ తదితర విపక్షాలు తనపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం అంశం పరిష్కారమయ్యేదాకా విధులకు దూరంగా ఉండాలని స్పీకర్‌ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ కార్యాలయాన్ని ఉటంకిస్తూ బిర్లా సన్నిహిత వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. నైతిక ప్రమాణాలకు కట్టుబడుతూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు వివరించాయి. స్పీకర్‌పై గానీ, డిప్యూటీ స్పీకర్‌పై గానీ అవిశ్వాస తీర్మానం సభ పరిశీలనలో ఉండగా కార్యకలాపాలకు వారు అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 96 కూడా నిర్దేశిస్తోంది. విపక్షాలు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ను స్పీకర్‌ ఆదేశించారు. దానిపై నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇప్పుడేం జరుగుతుంది?
స్పీకర్‌ ఓం బిర్లాను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ విపక్షాలు నోటీసివ్వడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ, విపక్షాల మధ్య పార్లమెంటులో పది రోజులుగా సాగుతున్న రగడ కాస్తా ఈ ఉదంతంతో కొత్త మలుపు తిరిగింది. దాంతో ఇకపై ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. స్పీకర్‌ తొలగింపు ప్రక్రియను ఆర్టీకల్‌ 94సి లో స్పష్టంగా పొందుపరిచారు. దానిప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్‌ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసివ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.

దానిపై కనీసం ఇద్దరు ఎంపీల సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో స్పీకర్‌పై నిర్దిష్టమైన అభియోగాలను పేర్కొనడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానంపై స్పందించేందుకు అవకాశం ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ పి.డి.టి.ఆచారి తెలిపారు. ‘‘తర్వాత తీర్మానంలోని భాష ప్రమాణాల మేరకు ఉన్నదీ లేనిదీ డిప్యూటీ స్పీకర్‌ పరిశీలిస్తారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌ ఎవరూ లేరు గనుక చైర్‌పర్సన్ల ప్యానల్‌లోని సీనియర్‌ మోస్ట్‌ సభ్యుడు ఆ బాధ్యత చేపట్టే అవకాశముంది. నోటీసిచ్చిన 14 రోజుల అనంతరం తీర్మానం సభ పరిశీలనకు వస్తుంది. సభాపతి దాన్ని సభ పరిశీలనకు ఉంచుతారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా కోరతారు.

కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానాన్ని పరిశీలిచేందుకు సభ అనుమతి లభించినట్టు ప్రకటిస్తారు. అనంతరం తీర్మానంపై చర్చ చేపడతారు. 10 రోజుల్లో దానిపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్మానంలో తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు ఆర్టీకల్‌ 96 స్పీకర్‌కు అవకాశం కలి్పస్తోంది’’అని ఆయన వివరించారు. స్పీకర్‌పై ఇప్పటికే దాకా మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, రెండుసార్లు ఓటింగ్‌ దాకా వచ్చినా అవి వీగిపోయాయి.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుసరించే పద్ధతి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని ఆచారి తెలిపారు. ‘‘మెజారిటీ లెక్కింపు విషయంలో ఓటింగ్‌కు హాజరైన ఎంపీలను మాత్రమే కాకుండా, ఖాళీలను మినహాయించి లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారందరి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలక పక్షానిదే అవుతుంది. కనుక తీర్మానం వీగిపోతుందే తప్ప గట్టెక్కదు’’అని వివరించారు. గతంలో స్పీకర్లు జీవీ మౌలాంకర్‌ (1954), హుకుంసింగ్‌ (1966), బలరాం జాఖడ్‌ (1987)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలిచ్చినా అవి వీగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement