మెదక్‌ మున్సిపాలిటీలో ఉద్రిక్తత | Tension In Medak Municipality At Midnight | Sakshi
Sakshi News home page

మెదక్‌ మున్సిపాలిటీలో ఉద్రిక్తత

Feb 10 2026 11:04 AM | Updated on Feb 10 2026 12:44 PM

Tension In Medak Municipality At Midnight

సాక్షి, మెదక్ జిల్లా: మెదక్‌ మున్సిపాలిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో అర్ధరాత్రి డబ్బులు పంచుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దొరికిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. డబ్బులు పంచుతున్నారంటూ కారుపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. అర్ధరాత్రి పూట వార్డుల్లోకి రావాల్సిన అవసరం ఏంటి అని కాంగ్రెస్ శ్రేణులను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవకు దారి తీసింది.

కాగా, బల్దియా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా మెదక్‌ మున్ని పాలిటీలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు వచ్చిన నిధులతో పాటు కొంత వారు కలిపి పంచుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 5 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.4 నుంచి రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. వాటిలో ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఆయా పార్టీలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది.

ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు.. కానీ ఆ వార్డులో ప్రత్యర్థి ఓడిపోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. డబ్బుల పంపిణీలో కేవలం కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులకు ఇచ్చి నేరుగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుడా ఫోన్‌లలో సైతం రహస్య విషయాలు మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు రికార్డు చేసి బహిర్గతం చేస్తారనే భయంలో అభ్యర్థులు కనీసం వారి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లాలోని 74 వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
 

Advertisement
 
Advertisement
Advertisement