మమతతో కట్.. లెఫ్ట్‌తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్‌! | Congress Announces Solo Fight In West Bengal Assembly Elections After TMC Snubs Alliance, Ends Alliance Talks | Sakshi
Sakshi News home page

మమతతో కట్.. లెఫ్ట్‌తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్‌!

Feb 10 2026 7:56 AM | Updated on Feb 10 2026 9:07 AM

Congress has ditched Left in Bengal contest Assembly polls alone

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్‌కు తెరదించుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన రెండు రోజులకే కాంగ్రెస్‌ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతలతో రాష్ట్ర నాయకులు చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.

సీట్ల సర్దుబాటుపై పేచీ
ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలే  కాంగ్రెస్‌-టీఎంసీలు విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెండు స్థానాల కోసం పొత్తు పెట్టుకోవడం కంటే, అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే పార్టీకి శ్రేయస్కరమని ఏఐసీసీ ఇన్‌చార్జ్ గులాం అహ్మద్ మీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గత అనుభవాల మేరకు..
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించి 12.25 శాతం ఓట్ల వాటాను పొందిన కాంగ్రెస్, 2021 నాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా, ఓట్ల శాతం 3 శాతానికి పడిపోవడం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. పొత్తుల  కారణంగా సొంత బలాన్ని కోల్పోతున్నామనే భావన  కాంగ్రెస్‌ నేతల్లో బలంగా నాటుకుపోయింది.

వామపక్షాలతోనూ..
మరోవైపు, ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలతో కూడా కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుంది. గత వైఫల్యాలను అంగీకరిస్తూ, భవిష్యత్తులో పార్టీ మనుగడ సాగించాలంటే సొంతంగా ఎదగడం తప్ప మరో మార్గం లేదని పరిశీలకుడు సుదీప్ రాయ్ బర్మన్  పేర్కొన్నారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్  కూడా తాము దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే ప్రకటించకుండా, ఎన్నికల ఫలితాల తర్వాతే తేల్చాలని పార్టీ నిర్ణయించింది.

ఓటు బ్యాంకు లేదని..
కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్‌లో కాంగ్రెస్ ఒక భారం అని, దానికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేదని సీపీఐ(ఎం) ఎద్దేవా చేసింది. బీజేపీ, టీఎంసీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, తెర వెనుక మమతా బెనర్జీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోందని మహ్మద్ సలీం ఆరోపించారు. ఈ విమర్శలతో విపక్షాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు బహిర్గతమయ్యింది.

చివరికి ఎవరికి లబ్ధి?
మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఒంటరి పోరుతో బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఆసక్తికరంగా మారింది. ఇటు అధికార టీఎంసీ, అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా బరిలోకి దిగుతుండటంతో చతుర్ముఖ పోటీ ఖాయమైంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? మమతా బెనర్జీ తన కోటను కాపాడుకుంటారా? లేక కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందా? అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: పుతిన్‌తో భేటీకి ఎప్‌స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..

Advertisement
 
Advertisement
Advertisement