ముంబై: గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం ముంబైలో సల్మాన్ ఖాన్, వికీ కౌశల్, రవీనా టాండన్, శిల్పా షెట్టి తదితరులకు భాగవత్ విందు ఇచ్చారు. ఆయనతో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను అద్నాన్ సమీ పోస్ట్ చేశారు.
‘‘భాగవత్ జీ అద్భుతమైన వ్యక్తి. నా అపోహలు, అపార్థాలను చక్కగా నివృత్తి చేశారు’’ అంటూ పొగడ్తలు కురిపించారు. దీనిపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లు తీవ్రంగా స్పందించాయి. ‘అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్తాన్ ఎయిర్ పోర్స్ పైలట్. 1965 యుద్ధంలో ఆయన మన పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ జాతి వ్యతిరేకి’ అని కాంగ్రెస్ ఎక్స్‌లో మండిపడింది. ఆర్థిక నేరారోపణలతో లుకౌట్ నోటీసు జారీ అయిన నటునికి విందు ఇచ్చిన భాగవత్ ఏం సందేశం ఇస్తున్నారని శివసేన (యూబీటీ) ప్రశ్నించింది.


