బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్‌ఎస్‌కు అర్హత లేదు | CM Revanth Reddy Fires On BRS, BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్‌ఎస్‌కు అర్హత లేదు

Feb 10 2026 12:58 AM | Updated on Feb 10 2026 12:58 AM

CM Revanth Reddy Fires On BRS, BJP

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటేయాలని విజ్ఞప్తి 

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏ ఒక్క పథకానికైనా అదనంగా నిధులు తెచ్చారా? 

మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు..మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? 

ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్,కేటీఆర్, హరీశ్‌రావు కారణం కాదా? 

బీఆర్‌ఎస్‌ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దన్న ముఖ్యమంత్రి 

మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: పన్నెండేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ ఇప్పుడు నిధులు తెస్తామంటే నమ్మాలా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏ ఒక్క పథకం కిందనైనా అదనంగా నిధులు తీసుకుని వచ్చారా? అని నిలదీశారు. పదేళ్లు వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు అన్ని పదవులు అనుభవించిన బీఆర్‌ఎస్‌కు సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఓటు వేయాలని అడిగే అర్హత లేదని అన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్‌ఎస్‌ కారణమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వాన్ని పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటు వేయాలని కోరారు. కళ్లముందున్న గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పారు. సోమవారం సీఎం తన నివాసంలో సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి, టీపీసీసీ నేత నీలం మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు.  

బీజేపీ ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? 
‘2014 ఎన్నికల ముందు మోదీ పాలమూరు సభలో రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు గడిచినా రాలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఆ విషయం ప్రస్తావిరని భావించా. కానీ దాని ఊసెత్తకుండా మోదీని చూసి ఓటేయండని అడిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఆదిలాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తామంటూ చెప్తారని ఆశించా. అదేమీ లేకుండా మహారాష్ట్రలో భూమి మునిగితే తెలంగాణ కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటూ రాష్ట్రాన్ని అవమానించారు. హైదరాబాద్‌లో వరద సమయంలో బండి సంజయ్‌ ఆటోకు ఆటో, బండికి బండి, ఇంటికి ఇల్లు అని ప్రచారం చేశారు. 

వారి మాట నమ్మి ప్రజలు దాదాపు 50 డివిజన్లలో గెలిపించారు. ఎన్నికలయ్యాక..మీకు ఇన్సూరెన్స్‌ ఉంది అన్నీ వస్తాయని చెప్పారు. సత్రంలో భోజనం ఉచితమే.. దానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖలా ఉంది బండి సంజయ్‌ తీరు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే యత్నం చేస్తున్నారు. 12 ఏళ్లుగా అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని వారిని ఇప్పుడు నమ్మొచ్చా? రాజ్యాంగబద్ధంగా, ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే నిధులను తాము ఇచ్చినట్లు చెప్పుకోవడమేమిటి? కేంద్రం తన విచక్షణతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరైనా మోదీ దృష్టికి తీసుకెళ్లారా?..’అని ముఖ్యమంత్రి నిలదీశారు.  

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు మాట్లాడతారా? 
‘కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీకి, ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం ఏమి న్యాయం? మూసీకి, మెట్రోకు, సమ్మక్క సారక్కకు, ఇతర దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చారా? వరంగల్‌ విమానాశ్రయం కోసం వందల కోట్లు ఖర్చు చేసి భూములు కేంద్రానికి ఇచ్చాం. పక్కనున్న ఏపీలో ఆరేడు విమానాశ్రయాలు ఉంటే.. తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? అసదుద్దీన్‌ను భూతంగా చూపించి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? బీజేపీకి అసదుద్దీన్‌ లైఫ్‌లైన్‌గా మారారు..’అని రేవంత్‌ విమర్శించారు.  

బీఆర్‌ఎస్‌ను యాసిడ్‌ పోసి కడగాలి 
‘బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ అసెంబ్లీకి రారు. వచ్చిన వారు అభివృద్ధి కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి వస్తారు. సభల్లో వారిద్దరు అహంకారం, విద్వేషంతో గంజాయి, కొకైన్‌ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ఈ పార్టీ వారికి ఓటు వేస్తే వారు మునిసిపాలిటీలకు రారు. అభివృద్ధి పట్టించుకోరు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కారణం కాదా? ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్‌ఎస్‌ను యాసిడ్‌ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. బీఆర్‌ఎస్‌ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దు..’అని సీఎం వ్యాఖ్యానించారు.  

మేం రెండేళ్లలో ఎన్నో చేశాం.. 
‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించి లాభాల బాటలోకి తెచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం.70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. 

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..’అని రేవంత్‌ కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement