తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి దళిత, గిరిజన విద్యార్థులు బలవుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో మృత్యు ఘంటికలు మోగుతున్నా అవి చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు మానవత్వం ఉంటే హాస్టల్‌లోని పిల్లలకు మేలు చేయాలని టీజేఆర్ సూచించారు.
ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్ హయాంలో హాస్టల్స్ ఎలా ఉన్నాయో చంద్రబాబు చూసి తెలుసుకోవాలన్నారు. జగన్ హయాంలో హాస్టల్స్ కు రూ.7,245 కోట్లు ఖర్చు చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు కేవలం రూ.455 కోట్లే ఖర్చు చేశారు. దాన్నిబట్టే సంక్షేమ హాస్టల్‌లో ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రతిరోజూ మంచి భోజనం పెట్టారు.
చంద్రబాబు ఎంతసేపూ పబ్లిసిటీ చేసుకోవటమే తప్ప విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?, హోంమంత్రి అనిత హాస్టల్‌లో తిన్న భోజనంలోనే బొద్దింక వచ్చినా పద్దతి మార్చు కోలేదు. ఇప్పటికి 18 సంఘటనల్లో వేలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల అవస్థలను పట్టించుకోరా?, పోలవరం జిల్లాలో 89 మంది ఆస్పత్రి పాలయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, విద్యార్థుల అవస్థలు మీ హైటెక్ ప్రభుత్వానికి తెలియటం లేదా?, గిరిజనులు, దళితులంటే ఎందుకంత కక్ష?, అన్ని రకాల వస్తువులకూ ధరలు విపరీతంగా పెరిగి జనం అవస్థలు పడుతున్నారు.
కానీ అభివృద్ధి, సంక్షేమం అద్భుతమని చంద్రబాబు తనకు తానే చెప్పుకుంటున్నారు. మీ పాలన ఎలా ఉందో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డే తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంద్రబాబు అమ్మేయపోతే జగన్ అడ్డుకున్నారు. ఇప్పటికీ అక్కడి ఉద్యోగులు భయంగానే బతుకుతున్నారు. అమరావతిలో రైతులను నిలువునా మోసం చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాజధానిలో ఏం జరుగుతోంది?, చంద్రబాబు చీకటి ఎత్తుగడలకు రైతులు అన్యాయం అవుతున్నారు. రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నా నిర్మాణాలు మాత్రం కనపడటం లేదు.

రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?, ఏఐ టెక్నాలజీ అని చెప్తూ మరి ఆ మేరకు పాఠ్యపుస్తకాలను ఎందుకు రూపొందించ లేదు?, టెక్నాలజీ ఉండాలిగానీ మితి మీరిన టెక్నాలజీ అవసరం లేదు. ముందు ఆకలితో ఉన్న వాడికి తిండి పెట్టండి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు అవుట్‌డేటెడ్ సీఎం. ఆయన ఆలోచనలు మారాలి. హెరిటేజ్ పెరుగు నాసిరకం అని ల్యాబులు నిర్ధారించాయి. సబ్ స్టాండర్డ్ అని తేల్చి చెప్పాయి. నాసిరకం పెరుగు విక్రయించినందుకు హెరిటేజ్ సంస్థ పెనాల్టీ కట్టింది. ఇలాంటి పనులు చేసినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి’ అని మండిపడ్డారు.


