ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ యువ బ్యాటర్ సుదిప్ కుమార్ ఘరామీ తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు.
ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఘరామీ బ్యాట్ నుంచి జాలువారిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ కారణంగా ఆంధ్రతో మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్ బౌలర్ మొహమ్మద్ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.
దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్ భరత్ (47), షేక్ రషీద్ (46), నితీశ్ కుమార్ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.
టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్, బెంగాల్ పేసర్ ఆకాశ్‌దీప్ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్ పడగొట్టాడు.
ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్ రికీ భుయ్ (1), నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.


