భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు.
డిమాండ్లు ఇవేనా?
ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. ఈ మ్యాచ్‌లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్‌తో మ్యాచ్ బహిష్కరించామన్న పాక్ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.
మాస్టర్ ప్లాన్!
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి
స్పందించిన బీసీసీఐ
ఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.
కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ సైతం తమకు భారత్‌లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.
ఉగ్రదాడి జరిగినా
అప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రకటించింది.
టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేసింది.
భారత్- పాక్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
చదవండి: ఛాయ్ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic
— ANI (@ANI) February 9, 2026


