పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్ బసిత్ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా భారత్- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్ పాకిస్తాన్ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మూడు బంతులు ఉండగా
నెదర్లాండ్స్ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.
తొలుత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బాస్ డీ లీడ్ (30; 4 ఫోర్లు), మిచెల్ లెవిట్ (24; 3 ఫోర్లు, 1 సిక్స్), అకెర్‌మన్ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, నవాజ్ తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (12), బాబర్ ఆజమ్ (15), ఉస్మాన్ ఖాన్ (0), షాదాబ్ ఖాన్ (8), నవాజ్ (6) విఫలమయ్యారు.
ఫహీమ్ ఆష్రఫ్ రాణించడంతో
విజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫహీమ్ ఆష్రఫ్ (11 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ షాట్‌లతో విజృంభించాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వ్యాన్ మీకెరెన్ చెరో 2 వికెట్లు తీశారు.
నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడౌడ్ వదిలేయడంతో అతడికి లైఫ్ రాగా.. పాక్ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ (Basit Ali) పాక్ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం (Babar Azam), నవాజ్, షాదాబ్ ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాకిస్తాన్ బతికిపోయింది
"పాకిస్తాన్ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్ ఆఫ్రిది బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్ ఆజం, నవాజ్, షాదాబ్ ఖాన్ అసలేం చేశారో వారికైనా తెలుసా?
వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్ ఆజం బ్యాటింగ్‌కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.
పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?
కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్ ఆష్రఫ్ లేకుంటే ఈరోజు పాక్ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్టార్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!


