ఖమ్మం: అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఖమ్మం జిల్లా మధిరలో మీడియా సమావేశం నిర్వహించారు భట్టి.
‘ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమానికి కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు – ఎన్ని వేల కోట్లయినా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇప్పటికే రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. రేషన్ కార్డులతో కుటుంబ సభ్యులకు 6 కిలోల సన్న బియ్యం పంపిణీ.
ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు. 2047 విజన్ డాక్యుమెంట్ తో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ చేరింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ కృషి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ కేంద్రాలు ఏర్పాటు. మధిరలో వరద నీరు నివారించేందుకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణం. వైరా నదిని టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ విద్యుత్ సరఫరా పనులు.మై మధిర – క్లీన్ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు అమలు’ అని భట్టి స్పష్టం చేశారు.


