గొగోయ్‌ దంపతులకు పాక్‌ ఏజెంట్‌తో బంధం | Gaurav Gogoi, wife have deeper connection with Pakistan agent says Assam cm | Sakshi
Sakshi News home page

గొగోయ్‌ దంపతులకు పాక్‌ ఏజెంట్‌తో బంధం

Feb 9 2026 5:15 AM | Updated on Feb 9 2026 5:15 AM

Gaurav Gogoi, wife have deeper connection with Pakistan agent says Assam cm

నిఘా సమాచారాన్ని చేరవేశారు 

అస్సాం సీఎం హిమంత ఆరోపణలు 

విచారణ జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి

గౌహతి: కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్‌ కాల్‌బర్న్‌కు పాకిస్తాన్‌ ఏజెంట్‌ అలీ తౌఖీర్‌ షేక్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి సేకరించిన సమాచారాన్ని వారు రహస్యంగా పాక్‌కు చేరవేశారన్నారు. గొగోయ్‌ దంపతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.

 ‘‘బ్రిటిష్‌ వనిత అయిన ఎలిజబెత్‌ భారత్‌లో పని చేసినప్పుడు అలీయే ఆమెకు వేతనం చెల్లించాడు. ఈ విషయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనల్ని ఉల్లంఘించారు. కాల్‌బర్న్‌ ఇండియా రావడానికి ముందు ఆలీ ఆధ్వర్యంలోని ‘లీడ్‌ పాకిస్తాన్‌’ సంస్థలో పనిచేశారు. ఇండియాకు బదిలీపై వచ్చి ‘లీడ్‌ ఇండియా’లో పని చేశారు. దీనికి లీడ్‌ పాకిస్తాన్‌ సంస్థే నిధులు బదిలీ చేసింది. ఇందుకు యూపీఏ ప్రభుత్వం సహకరించి ఉండొచ్చు’’ అన్నారు.

గొగోయ్‌కి ధైర్యముందా: కాల్‌బర్న్‌ ఇండియాలో పని చేస్తుండగా దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆలీకి చేరవేశారని హిమంత చెప్పారు. ‘‘ఆమె ఆరుసార్లు పాక్‌ వెళ్లొచ్చారు. మరోఎన్జీఓలో చేరాక మూడుసార్లు వెళ్లారు. కాల్‌బర్న్‌ భారత్‌లో ఉండడం దేశానికి ప్రమాదకరం. ఆమె ఓవర్సీస్‌ సిటిజెన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) గుర్తింపును రద్దు చేయాలి. గౌరవ్‌ గొగోయ్‌ కూడా 2013లో అత్యంత రహస్యంగా పాకిస్తాన్‌లో పర్యటించారు.

 అక్కడ శిక్షణ పొంది ఉండొచ్చు. ఆ తర్వాతే ఆయన ఎంపీగా గెలిచారు. తర్వాత సైన్యం సన్నద్ధత, భద్రత, ఆయుధాలు, రక్షణ సామగ్రి, అణ్వాయుధాల ప్లాంట్లు, గూఢచర్యం వంటి సున్నితమైన అంశాలపై లోక్‌సభలో ప్రశ్నలు అడిగారు. ఓ తొలిసారి ఎంపీ అలాంటి ప్రశ్నలు వేయడం వెనుక ఆంతర్యమేమిటి? పాక్‌ పర్యటన విషయంలో నిజాలు చెప్పే ధైర్యం గొగోయ్‌కి ఉందా?’’ అని హిమంత సవాలు విసిరారు. సచీ్ఛలత నిరూపించుకోవాలని, లేదంటే దేశద్రోహ అభియోగాలు ఎదుర్కోవాలని అన్నారు.

సి–గ్రేడ్‌ సినిమా: గొగోయ్‌
హిమంత చేసిన ఆరోపణలు సి–గ్రేడ్‌ సినిమా కంటే అధ్వాన్నమని గౌరవ్‌ గొగోయ్‌ ఎద్దేవా చేశారు. ఆయన మతిలేని, బోగస్‌ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ‘‘అస్సాంలో భూములను శర్మ, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. వారి బండారం బయటపెడతాం’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement