114 రఫేల్‌ జెట్ల ఒప్పందం ఖరారు!  | India Approves Proposal to Acquire 114 Rafale Fighter Jets | Sakshi
Sakshi News home page

114 రఫేల్‌ జెట్ల ఒప్పందం ఖరారు! 

Feb 9 2026 5:00 AM | Updated on Feb 9 2026 5:00 AM

India Approves Proposal to Acquire 114 Rafale Fighter Jets

న్యూఢిల్లీ: అత్యంత అధునాతన, శక్తిమంతమైన  రఫేల్‌ యుద్ధ విమానాలతో భారత గగనతలాలను శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రక్రియను రక్షణ శాఖ వేగవంతం చేసింది. రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఒకేసారి 114  రఫేల్‌ ఫైటర్‌జెట్‌లను కొనుగోలుచేసేందుకు ఉద్దేశించిన సమీకరణ ఒప్పంద ప్రతిపాదనలకు సాయుధ ఉపకరణాల సమీకరణ బోర్డ్‌ ఇటీవల పచ్చజెండా ఊపగా, రక్షణ కొనుగోళ్ల మండలి వాటికి ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. 

ఈ నెల చివరికల్లా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన రక్షణరంగ ప్రైవేట్‌ దిగ్గజం డసాల్ట్‌ ఏవియేషన్‌ నుంచి ఈ ఫైటర్‌ జెట్‌లను కొనుగోలు చేయనుండటం గమనార్హం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సారథ్యంలోని రక్షణ కొనుగోళ్ల మండలి త్వరలో రోజుల్లో సమావేశమై లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ‘కనీస అనుమతి’ప్రతిపాదనకు అంగీకారం తెలపనుంది. ఒప్పందం సాకారమైతే కేవలం 18 విమానాలు మాత్రమే ఫ్రాన్స్‌లో తయారై నేరుగా భారత్‌కు ఎగిరొస్తాయి. 

మిగతా వాటిని భారత్‌లోనే ఉత్పత్తి కర్మాగారాలను నెలకొల్పి దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ లెక్కన దాదాపు 80 శాతం విమానాలు భారత్‌లోనే తయారుకానున్నాయి. అంతేకాదు, వాటిల్లో 60 శాతం విడిభాగాలను మేకిన్‌ ఇండియా ఆత్మనిర్భరత కార్యక్రమంలో భాగంగా ఇక్కడే అభివృద్ధి చేయనున్నారు. రఫేల్‌ యుద్ధవిమానాలను దేశీయంగా తయారు చేయాలని భారత్‌ నిర్ణయించుకున్న నేపథ్యంలో స్థానిక ప్రైవేట్‌ కంపెనీలతో దసాల్ట్‌ ఏవియేషన్‌ ఒప్పందాలు చేసుకోవాల్సి రావొచ్చు. అసెంబ్లింగ్, తయారీ యూనిట్లను నెలకొల్పాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement