
స్కాల్ప్, హ్యామర్ క్షిపణులను ప్రయోగించిన భారత సైన్యం
ఉగ్ర శిబిరాలపై కచ్చితత్వంతో దాడి
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ముష్కరుల భరతం పట్టడానికి భారత సైన్యం అత్యాధునిక క్షిపణులు ప్రయోగించింది. స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేయడంలో స్కాల్ప్ క్షిపణులు పేరుగాంచాయి. వీటిని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. పగటిపూట, రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించేలా ఉండడం వీటి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.
స్కాల్ప్ మిస్సైల్స్ రేంజ్ 450 కిలోమీటర్లు. జీపీఎస్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. అడ్వాన్స్‌డ్ నావిగేషన్ సిస్టమ్ వల్ల గురి తప్పదు. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ ఈ క్షిపణులను తయారు చేసింది. దృఢమైన బంకర్లు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడానికి ఇవి చక్కగా తోడ్పడతాయి. గత ఏడాది ఉక్రెయిన్ సైన్యం ఇలాంటి క్షిపణులనే తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. స్కాల్ప్ మిస్సైల్ 450 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయోగించగల వీలుంది కాబట్టి శత్రువుల నిఘా వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం.