గతేడాది భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన హెచ్చరికల వల్లే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ అన్నారు.
గతేడాది మేలో పెహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. దీంతో దాయాది దేశం ఉక్కిరి బిక్కిరి అయింది. పాక్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాక్ పాల్పడింది. కానీ భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేసింది.
దాదాపు నాలుగు రోజుల తర్వాత పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రచారం జరిగింది. కానీ కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. కానీ ట్రంప్ మాత్రం నేనే అపానని గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు మరోసారి అదే పాట పాడారు.
"ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్దం తీవ్రంగా సాగుతోంది. విమానాలు కూలిపోతున్నాయి. భారత ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు, అలాగే పాక్ ప్రధాని కూడా తెలుసు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. యుద్ద విరమణ చేయకపోతే మీ రెండు దేశాలతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను. మీ దేశాల నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించాను. భారీగా నష్టపోతామని తెలియగానే రెండు దేశాలు వెనక్కి తగ్గాయి. ఈ సమయంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు


