‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్‌ | I Have Nothing to hide Trump Responds to Epstein link Claims | Sakshi
Sakshi News home page

‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్‌

Feb 17 2026 9:19 AM | Updated on Feb 17 2026 9:43 AM

I Have Nothing to hide Trump Responds to Epstein link Claims

వాషింగ్టన్‌: లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తాను పూర్తిగా నిర్దోషిగా తేలానని, దర్యాప్తు సంస్థలు కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చాయని అన్నారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, దాచడానికి నా దగ్గర ఏమీ లేదు​’ అని విలేకరుల ఎదుట  ట్రంప్ వివరణ ఇచ్చారు. డెమొక్రాట్లు తనపై బురద చల్లాలని చూశారని, అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఎప్‌స్టీన్‌ కేసులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో పాటు పలువురు డెమొక్రాట్ నేతల పేర్లు బయటకు వచ్చాయని, అది వారి సమస్య అని ట్రంప్‌ పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ ‘ట్రంప్ డెరాంజ్మెంట్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని, అందుకే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శించారు. ఎప్‌స్టీన్‌ తన ఎదుగుదలను అడ్డుకోవాలని చూశారని కూడా ట్రంప్  తెలిపారు.
 

జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన రికార్డుల ప్రకారం 2000వ దశకం మధ్యలో ఎప్‌స్టీన్‌పై దర్యాప్తు జరుగుతున్న సమయంలో ట్రంప్ పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎప్‌స్టీన్‌ ప్రవర్తన గురించి చాలా కాలంగా అందరికీ తెలుసని, అధికారుల చర్యలు తీసుకోవడం మంచిదేనని అప్పట్లో ట్రంప్ అన్నట్లు ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూలో వెల్లడయ్యింది. అలాగే తన ‘మార్ ఏ లాగో’ క్లబ్‌లోకి ఎప్‌స్టీన్‌ను రాకుండా నిషేధించానని ట్రంప్‌ తెలిపారు. ఒకానొక సందర్భంలో టీనేజర్లు అక్కడ కనిపించడంతో తాను ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని ట్రంప్ దర్యాప్తులో వెల్లడించారు.

ఎప్‌స్టీన్‌ ఉదంతంలో ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, తదుపరి విచారణ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌ అనుచరురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ కేసులో భాగంగా 2021లో ‘మార్ ఏ లాగో’ క్లబ్‌కు కోర్టు నోటీసులు పంపిన మాట నిజమేనని రికార్డులలో తేలింది. ప్రస్తుతం మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా, ఎప్‌స్టీన్‌ 2019లో జైలులో మృతి చెందారు.

ఇది కూడా చదవండి: భూమిపైకి ఏలియన్స్‌.. ఒబామా వ్యాఖ్యల కలకలం!

Advertisement
 
Advertisement
Advertisement