వాషింగ్టన్: గ్రహాంతరవాసులు(ఏలియన్స్)కి సంబంధించిన చర్చ మరోమారు వైరల్ అవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏలియన్స్ ఉనికిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల బ్రయాన్ టైలర్ కోహెన్ నిర్వహించిన ‘నో లై’ (No Lie) పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఒబామా పాల్గొన్నప్పుడు.. రాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా ‘ఏలియన్స్ నిజమేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ, ‘అవి నిజమే, కానీ నేను వాటిని ఎప్పుడూ చూడలేదు’ అని సరదాగా సమాధానమిచ్చారు. ఈ చిన్నపాటి వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఇదే ఇంటర్వ్యూలో ఒబామా ‘ఏరియా 51’ వంటి వివాదాస్పద అంశాలపై కూడా స్పందించారు. గ్రహాంతర వాసులను అమెరికా ప్రభుత్వం రహస్య స్థావరాలలో దాచి ఉంచిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘అవేవీ ఏరియా 51లో బందీగా లేవు. ఒకవేళ ఏదైనా భారీ కుట్ర జరిగి, అమెరికా అధ్యక్షుడికే తెలియకుండా వాటిని భూగర్భ గదుల్లో దాచి ఉంచితే తప్ప.. అలాంటివేవీ అక్కడ లేవు’ అని నవ్వుతూ పేర్కొన్నారు. కేవలం సరదాగా సాగిన ఈ సంభాషణను చాలా మంది సీరియస్‌గా తీసుకోవడంతో, ఒబామా తిరిగి రంగంలోకి దిగాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఒబామా ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చారు. విశ్వం చాలా విశాలమైనదని, గణాంకాల ప్రకారం ఎక్కడో ఒకచోట జీవం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని అన్నారు. అయితే, సౌర కుటుంబాల మధ్య దూరం ఊహించలేనంత ఎక్కువగా ఉండటం వల్ల, గ్రహాంతర వాసులు భూమిని సందర్శించే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. తన అధ్యక్ష పదవీ కాలంలో (2009-2017) గ్రహాంతర వాసులు భూమిని సంప్రదించినట్లు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదని ఆయన తేల్చి చెప్పారు.
బరాక్ ఒబామా ఏలియన్స్ అంశంపై మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో జేమ్స్ కార్డెన్ టాక్ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన ఇవే విషయాలను ప్రస్తావించారు. తాను బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఏలియన్స్ నమూనాలు లేదా వ్యోమనౌకలు భద్రపరిచిన ల్యాబ్‌లు ఏవైనా ఉన్నాయా అని అధికారులను ఆరా తీశానని, దానికి ‘లేదు’ అనే సమాధానం వచ్చిందని అన్నారు. అయినప్పటికీ, ఆకాశంలో కనిపించే కొన్ని వింత వస్తువుల కదలికలకు సంబంధించిన దృశ్యాల రికార్డులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: ‘శబరిమలకు మహిళలు’.. తుది విచారణకు ‘సుప్రీం’


