ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!
... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్‌లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.
మీథేన్ తప్ప మిస్టరీ కాదు!
బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్‌లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది!

సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!
త్రిభుజాకార ప్రమాద స్థలి
సినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్‌లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్‌జువాన్.. ఈ మూడు పాయింట్‌లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్.

సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్‌ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?
ఎందుకు మునుగుతున్నాయి!
‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. 
అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం.
ఇప్పుడెందుకు అలా లేదు?!
అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు.
‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది.
మీథేన్ కథ కూడా గ్యాసేనా?
సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్‌లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్‌లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్‌లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు.
నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ
1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!
ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్‌లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?!
ఐదు శతాబ్దాల మిస్టరీ!
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్‌లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు.

అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్‌ని చేసేశాయి.
లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధన
ప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. 
బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం
గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.
సాక్షి, స్పెషల్ డెస్క్


