జైపూర్: పశ్చిమ రాజస్థాన్‌కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మరణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆర్‌ఎల్‌పీ (RLP) నేత హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. బుధవారం(జనవరి 28) సాయంత్రం జోధ్‌పూర్‌లోని బోరనాడ ఆశ్రమం నుంచి సాధ్వి ప్రేమ్ బైసాను ఆమె తండ్రి వీరమ్ నాథ్, మరొక సహాయకుడు కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
వైద్యుడు ప్రవీణ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్విని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమె శరీరంలో ఎటువంటి చలనం లేదని.. సాధ్వికి జ్వరం రావడంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్‌ను పిలిపించామని, ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె తండ్రి తనకు చెప్పినట్లు డాక్టర్ వెల్లడించారు. అయితే, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తాను అంబులెన్స్ ఇస్తానన్నా, నాథ్ నిరాకరించి తన సొంత కారులోనే ఆమెను తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు.
ఆమె చాలా కాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతోందని వీరమ్ నాథ్ మీడియాతో చెప్పారు. అందుకే కాంపౌండర్‌ను పిలిపించాం. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆమె స్పృహ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకుని, అతని వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సంచలన రేపుతోంది. సాధ్వి మరణించిన నాలుగు గంటల తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి ఒక పోస్ట్ రావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ‘‘నేను ప్రతి క్షణం సనాతన ధర్మ ప్రచారం కోసం జీవించాను. నా జీవితాంతం జగద్గురు శంకరాచార్యులు, యోగా గురువులు, సాధు సంతుల ఆశీస్సులు అందుకున్నాను. అగ్ని పరీక్ష కోరుతూ నేను వారికి లేఖలు కూడా రాశాను. కానీ ప్రకృతి ఏం తలపెట్టిందో? నేను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్తున్నాను. నా జీవిత కాలంలో కాకపోయినా, నా మరణం తర్వాతైనా నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ అంటూ తన అనుచరులను ఉద్దేశించి అందులో చెప్పుకొచ్చారు.
ఈ పోస్ట్ ఆమె మొబైల్ నుండే షేర్ అయినట్లు ఆమె తండ్రి ధృవీకరించారు. ఒక తోటి గురువు ఆ సందేశాన్ని పంపారని ఆయన చెబుతూ, తన కుమార్తె మరణంపై దర్యాప్తు జరగాలని కోరారు. గత ఏడాది ప్రేమ్ బైసా, ఆమె తండ్రి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక గదిలో ఆమె తన తండ్రిని హత్తుకుని ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఒక మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. అయితే, అది తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనురాగానికి నిదర్శనమని, ఆ బంధాన్ని కించపరచడానికే ఎవరో ఆ వీడియోను వైరల్ చేశారని సాధ్వి అప్పట్లో మండిపడ్డారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు కూడా..


