ఇంట్లో రెండురోజులు మృతదేహాన్ని పెట్టుకున్న వైనం
ఉరికి వేలాడుతున్న తల్లిని పిల్లలకు చూపించిన శాడిస్టు భర్త
మృతురాలి సంబంధీకుల ఆరోపణలు
వైఎస్‌ఆర్ కడప జిల్లా: నందలూరు రైల్వేలోకోపైలెట్ శ్రీరామ్ శ్రీనివాస్ రెండో భార్య కృష్ణవేణి మరణం వెనుక అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న రాత్రంతా మద్యం సేవించి ఇంటిలోనే ఉన్నట్లు, గురువారం అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
శ్రీరామ్ శ్రీనివాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు అమ్మ చచ్చిపోయింది అని కిటికీలోంచి ఉరి వేసుకున్న కృష్ణవేణిని చూపించినట్లు తెలిసింది. అనంతరం పిల్లలకు భోజనాలు పెట్టి, తను మద్యం సేవించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పిల్లలతోనే భర్త ఉండిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణవేణి వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు.పది సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడింది.
ఆరుసంవత్సరాల కిందట మృతురాలిని వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మరో అమ్మాయి ప్రేమలో పడి భార్యకు చిత్రహింసలు పెడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోభార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. కాల్చి వాత పెడుతున్నట్లు, ఆ గాయాలను పుట్టింటి వారికి చూపించి బాధపడేదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి వంటిపై గాయాలు కూడా ఉన్నట్లుగా సంబంధీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు నాగరాజు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తూ శ్రీరామ్ శ్రీనివాస్‌కు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.


