గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. కేంద్రం కొత్త ఆదేశాలు | Govt directs households with both PNG and LPG connection to surrender their LPG connection | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. కేంద్రం కొత్త ఆదేశాలు

Mar 15 2026 5:44 PM | Updated on Mar 15 2026 5:56 PM

Govt directs households with both PNG and LPG connection to surrender their LPG connection

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ,పీఎన్‌జీ గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్‌ కనెక్షన్‌ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. 

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్‌, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్‌ సైతం ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

గ్యాస్‌ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని  
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్‌పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పిప్డ్ నేచురల్ గ్యాస్‌ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్‌పీజీ కనెక్షన్‌ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్‌జీ కనెక్షన్‌తో పాటు ఎల్‌పీజీ కనెక్షన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

పీఎన్‌జీ గ్యాస్‌ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్‌పీజీ కనెక్షన్‌ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్‌పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్‌పీజీ కనెక్షన్‌ను సమర్పించిన తర్వాత పీఎన్‌జీ ద్వారా గ్యాస్‌ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్‌ కనెక్షన్లు తగ్గనున్నాయి.

ఈ నిర్ణయంపై గ్యాస్‌ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్‌పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్‌పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు.  

కాగా, పెట్రోలియం అండ్‌ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ (LPG) కనెక్షన్‌ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్‌ (PNG) కనెక్షన్‌1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement