గుర్తించిన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు
ఆవాసానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? మనం ఉంటున్న భూగోళంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా కచి్చతమైన సమాధానం లేదు. అయితే, జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది.
భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలోని ఈ గ్రహానికి ‘జీజే 251సీ’ అని పేరుపెట్టారు. అంతేకాకుండా దీన్ని ‘సూపర్ ఎర్త్’గా పరిగణిస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం. మనం నివసిస్తున్న భూగ్రహం కంటే నాలుగురెట్లు పెద్దది కావడం విశేషం. అక్కడ అధికంగా రాళ్లు రప్పలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అది ‘రాకీ ప్లానెట్’ అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించడం ఈ ఏడాది ఖగోళ పరిశోధనల్లో అతిపెద్ద మలుపుగా చెబుతున్నారు.
ఈ పరిశోధన వివరాలను అ్రస్టానామికల్ జర్నల్‌లో ప్రచురించారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే జీజే251సీ గ్రహం గోల్డిలాక్స్ జోన్‌లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలాకాలంగా అన్వేíÙస్తున్నామని పెన్సిల్వేనియా వర్సిటీ సైంటిస్టులు చెప్పారు.
రెండు దశాబ్దాలుగా ఈ పరిశోధన కొనసాగుతుండడం విశేషం. ఇందుకోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. సూపర్ ఎర్త్‌పై వాతావరణాన్ని క్షుణ్నంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆక్సిజన్ లేదా మీథేన్ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుందనడంలో సందేహం లేదు.


