సాక్షి, హన్మకొండ జిల్లా: నాటుకోళ్ల కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలంలో వదిలేసినట్లు పోలీసులు తేల్చారు. వరదలో రెడ్డిపురం ఫామ్లోని కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మిగిలిన కోళ్లను రైతు పొలాల్లో వదిలేశారు.
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన గత శనివారం రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్కతుర్తివాసులు మొత్తం.. పత్తి చేలలో పరుగెత్తారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరు ఊరంతా దద్దరిల్లింది. కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. మరో వైపు, కోళ్లలో వ్యాధి ఉందనే వదంతులు చక్క ర్లు కొట్టాయి. ఎల్కతుర్తి పశువైద్యాధికారి కూడా వందతులను ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపిల్స్‌ను వరంగల్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు విచారణ చేపట్టిన పోలీసులు.. చివరికి ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలాల్లో వదిలేసినట్లు స్పష్టం చేశారు.


