సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది.
రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు.


