ఘట్‌కేసర్: ఎల్పీజీ సిలిండర్ పేలడంతో మారుతీ ఒమ్నీ వ్యాన్‌కు నిప్పంటుకుని పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం పోచారం డివిజన్ అన్నోజీగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నోజీగూడకు చెందిన పెద్దపల్లి రాజు రెండు నెలల క్రితం ఏపీ మారుతి ఒమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. శుక్రవారం నాగారం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అన్నోజీగూడ కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ప్రమాదవశత్తు కారులోని ఎల్‌పీజీ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.
దీనిని గుర్తించిన డ్రైవర్ వెంటనే కారును సరీ్వస్ రోడ్డుపై నిలిపి ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. అయితే వాహనం గేర్‌లోనే ఉండడంతో మంటలతోనే నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు వెనక్కి వెళ్లి రెండు మెడికో పంపుల మధ్యన ఆగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్ బంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.



