చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించి ఉంటుందిలెండి. మందుమాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్లూ కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన‍్సన్. ఎవరీ బ్రయన్? ఏమిటీ దీని వెనుక బ్రెయిన్?
బ్రయన్ జాన్సన్ ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరక్కుండా చూసుకుంటూంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి... వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా? అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏమిటంటే...కొన్ని పద్దతులను కచ్చితంగా ఉపయోగించడం మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజూ వంద వరకూ ట్యాబ్లెట్లు. బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు మింగుతూంటాడు.
వీటిల్లో మల్టీ విటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమెగా-3, కొలేజన్ మిశ్రమాలు, పాలిఫినాల్‌లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్, దీర్ఘాయుష్షు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా.. మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలూ రోజూ తీసుకుంటూంటాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి 20 లక్షల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు!. వీటన్నింటి కారణంగానే ఏమో... 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. వందేళ్లు కాదు.. ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు.
సులువుగా సరికొత్త మందులు...
ఐదేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్షు కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్షును జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్షు సాధ్యమంటాడు. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ... శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ.. మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం సిద్ధించినా.. అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైతేనేం.. బ్రయన్ జాన్సన్‌కు జై! అమరత్వం జిందాబాద్!


