డాక్టర్లను సంప్రదించకుండానే మందుల వినియోగం
మెడికల్ స్టోర్లలోనూ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు
కొత్త రోగాలను ‘కొని’ తెచ్చుకుంటోన్న బాధితులు
పుట్టపర్తికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం జలుబు చేసింది. ఈ క్రమంలో గూగుల్‌లో మాత్రల కోసం వెతికి స్థానికంగా ఉండే ఓ మెడికల్ స్టోర్‌లో రెండు, మూడు రకాల మాత్రలు తీసుకుని మింగాడు. జలుబుతో పాటు దగ్గు, జ్వరం ఎక్కువైంది. మాట్లాడేందుకు కూడా కాలేదు. వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాడు. మోతాదుకు మించి మందులు తీసుకోవడంతోనే సమస్య తలెత్తినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అయినట్లు బాధితుడు తెలిపాడు.
ధర్మవరానికి చెందిన ఓ 55 ఏళ్ల మహిళకు జనవరి రెండో వారంలో జ్వరం సోకింది. వెంటనే తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మందుల ఫొటోలు తెప్పించుకుంది. అనంతరం స్థానికంగా ఓ మెడికల్ షాపులో వాటిని తెచ్చుకుని మింగింది. మరుసటి రోజున ఉదయం నుంచి వాంతులు కావడంతో పాటు నీరసం వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పలు పరీక్షలు చేసిన తర్వాత రోగానికి సంబంధం లేని మాత్రలు మింగడంతో సమస్య తలెత్తిందని తేల్చాడు. అప్పటికే సుమారు రూ.5 వేల వరకు ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరే కాదు.. జిల్లాలో చాలామంది ఇటీవల సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు.
సాక్షి, పుట్టపర్తి: ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌లో పరిశోధించి మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య సత్యసాయి జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువగా పారాసిటమాల్ మాత్రను కొనుగోలు చేస్తున్నారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, జలుబు ఏది సోకినా.. డాక్టర్‌ను సంప్రదించకుండానే ఆ మాత్రను మింగేయడం అలవాటుగా మార్చుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మందుల గురించి కూడా గూగుల్‌లో వెతికి వాటి ద్వారా వచ్చే దుష్ఫలితాలను తెలుసుకుని వాడకుండా పడేస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
అతి తెలివితో ప్రమాదం
పల్లె ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్లలేక స్మార్ట్‌ఫోన్ ద్వారా గూగుల్‌లో పరిశోధించి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు. అలాంటి మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలిక రోగాలకు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది కిడ్నీ బాధితుల్లో అతిగా మాత్రల వినియోగంతోనే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.
విచ్చలవిడిగా విక్రయాలు
డాక్టర్ ప్రి్రస్కిప్షన్ లేకున్నా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందులు విక్రయిస్తున్నారు. మొబైల్‌లో చూపించినా, వాట్సాప్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించినట్లు తెలిపినా మందులిస్తున్నారు.డాక్టర్‌ను సంప్రదించకుండా వెళ్లే వారిని మెడికల్ షాపుల నిర్వాహకులు కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారం పోగొట్టుకోలేక విక్రయాలు చేస్తున్నారు.
వైద్యులను సంప్రదించాలి
జబ్బు చేసినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. గూగుల్‌లో పరిశోధించి కొనే మాత్రలతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ వద్దకు వెళ్తే రోగ తీవ్రత ఆధారంగా మాత్రల మోతాదు ఇస్తారు. అతి తెలివి ప్రదర్శించి లేని పోని రోగాల బారిన పడొద్దు. జబ్బు ముదిరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. గూగుల్‌లో దొరికే సమాచారమంతా కచ్చితమైనది కాదు. – డాక్టర్ ఫైరోజబేగం, డీఎంహెచ్‌ఓ


