కార్మిక నగర్‌లో నేలమట్టమైన ఇళ్లు
ఒంగోలు నార్త్ బైపాస్‌లోని కార్మిక నగర్‌లో నిరుపేదల ఇళ్లను కూల్చేసిన పచ్చమూకలు
రాత్రివేళ 200 మంది ప్రైవేటు సైన్యం, మూడు జేసీబీలతో వచ్చి విధ్వంసం
కార్మికనగర్‌లో స్థలాల విలువ పెరగడంతో పచ్చనేతల కన్ను
కనీసం ఇళ్లలోని వస్తువులు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా దౌర్జన్యం
ఉన్నఫళంగా ఇళ్లు కూల్చేయడంతో బాధితుల ఆర్తనాదాలు
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలు నార్త్ బైపాస్‌లోని హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రి వెనక ఉన్న కార్మిక నగర్‌ను బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. సుమారు 200 మంది ప్రైవేటు సైన్యం, మూడు జేసీబీలను తీసుకొచ్చి కాలనీపై విరుచుకు పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 186లో సుమారు 12 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయి. గత 11 ఏళ్లుగా కూలినాలి చేసుకునే కొందరు నిరుపేదలు రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇటీవల కార్మికనగర్‌లో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం రూ.12 కోట్ల చొప్పున పలుకుతుండడంతో అధికార పార్టీకి చెందిన బడా నాయకుల కన్నుపడింది. శరవేగంగా తెరవెనుక తతంగం నడిపించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేతలు తమ ప్రైవేటు సైన్యంతో కార్మిక నగర్‌లోకి ప్రవేశించారు. అక్కడ 60 ఇళ్లల్లో నివాసం ఉండే నిరుపేదలకు ఏం జరుగుతుందో తెలియలేదు.
చీకట్లోనే జేసీబీలతో ఇళ్లను వరుసగా నేలకూల్చారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. ఒక ఇంటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కేవలం గంటన్నర లోపే కాలనీలో షెడ్లు, గుడిసెలు నేలమట్టయ్యాయి. బాధితుల రోదనలు మిన్నంటినా పట్టించుకునే వారు లేరు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కనీసం సామాన్లు సర్దుకునేందుకు సమయం ఇవ్వమంటూ కాళ్లు చేతులు పట్టుకుని బతిమాలినా వినలేదని బాధిత మహిళలు రోదిస్తున్నారు.
అడ్డు వస్తే మనుషులను కూడా కూల్చేస్తాం..
‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు కాకపోతే మరోసారి ఈ భూములను తీసుకోలేం.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఇళ్లను మాత్రమే కూల్చేశాం.. రేపు అవసరమైతే మనుషులను కూడా ఇలాగే కూల్చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు వాపోయారు. ఇదంతా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విధ్వంసం జరుగుతున్న సమయంలో ఒక మహిళా ఏఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై తాలుకా సీఐ విజయకృష్ణను విచారించగా డయల్ 100కు ఫోన్ వస్తే తమ సిబ్బంది వెళ్లారని, ఏదో భూవివాదం జరుగుతుండడంతో తమకు సంబంధం లేదని.. వెనక్కి వచ్చేశారని చెప్పారు. జేసీబీల విషయం తమకు తెలియదని.. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


