చంద్రబాబు సర్కారుకు ‘వక్ఫ్‌’ దెబ్బ | All members absent from State Waqf Board meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుకు ‘వక్ఫ్‌’ దెబ్బ

Feb 6 2026 5:24 AM | Updated on Feb 6 2026 5:24 AM

All members absent from State Waqf Board meeting

వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం చేసేందుకు టీడీపీ కూటమి ఎత్తుగడ 

రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరు 

వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ తీరుపై సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి 

అజెండా కాపీ ముందురోజు అర్ధరాత్రి ఇవ్వడంపై ఆగ్రహం  

సాక్షి, అమరావతి: రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరగాల్సిన రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చినకాకాని, మల్లాయపాలెంలోని వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ సభ్యులు తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశానికి గైర్హాజరు కావడం వక్ఫ్‌ బోర్డు చరిత్రలోనే సంచలనంగా మారింది. 

వక్ఫ్‌ ఆస్తులను ఏపీఐఐసీకి బదలాయించి.. ఆపై ఇండ్రస్టియల్‌ ఎస్టేట్‌ పేరుతో అయిన వారికి ఫలహారంగా పంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. గురువారం ఉదయం వక్ఫ్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు బుధవారం అర్ధరాత్రి వాట్సాప్‌ ద్వారా సమాచారం (అజెండా) ఇవ్వడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు మెప్పు కోసం వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై మండిపడ్డారు. వారంతా మూకుమ్మడిగా గైర్హాజరవడంతో చేసేది లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు చైర్మన్‌ అజీజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు 13వ సమావేశానికి కొంతమంది సభ్యులు అత్యవసర పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోయారని, అందరూ ఉన్నప్పుడే సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

పీపీపీ అంటూ కొత్త పల్లవి 
వక్ఫ్‌ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వేసిన భూ సేకరణ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజు అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. వాస్తవానికి వక్ఫ్‌ బోర్డు చట్టం ప్రకారం వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన టైటిల్‌ను వేరొక సంస్థకు, ప్రభుత్వ శాఖకు బదలాయించకూడదు. అయినా మల్లాయపాలెం, చినకాకాని వక్ఫ్‌ భూములపై ప్రభుత్వం దొంగాట ఆడుతోందని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. 

గతేడాది గుంటూరు జిల్లా పెద్ద మసీదుకు చెందిన ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెంలోని 226 ఎకరాల వక్ఫ్‌ భూమిని ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చి సేకరించేందుకు చేసిన ప్రయత్నాలపై ముస్లిం నేతలు, వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలతో వక్ఫ్‌ బోర్డు వెనకడుగు వేసింది. దీంతో భూ సేకరణ ద్వారా ఆ భూముల్ని ఇవ్వడం లేదని.. పీపీపీ లేదా లీజు పద్దతిలో ఇస్తామంటూ వక్ఫ్‌ బోర్డు సమావేశ అజెండాలో పేర్కొన్నారు. గతంలో సభ్యుల గైర్హాజరుతో రెండు పర్యాయాలు సమావేశాలు వాయిదా పడ్డాయి.  

చివరకు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజీజ్‌ సొంత ప్రాంతమైన నెల్లూరులో నిర్వహించిన మూడవ సమావేశంలో గుంటూరు మసీదుకు చెందిన వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతానికి తాము వ్యతిరేకమని, పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజుకు సైతం సభ్యులు అంగీకరించకపోడంతో బోర్డు నిర్ణయం తీసుకోలేకపోయింది. తాజాగా గుంటూరు అంజుమన్‌–ఇ–ఇస్లామియా సంస్థకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా ఏపీఐఐసీకి ఇచ్చేందుకు నిర్ణయించారు.

ముస్లిం పెద్దల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ పీపీపీ, దీర్ఘకాలిక లీజు పల్లవిని అందుకుంది. చివరకు మల్లాయపాలెం, చినకాకాని భూములను పీపీపీ, దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా తీర్మానం చేసేందుకు వక్ఫ్‌ బోర్డు సమావేశ అజెండా చేర్చారు. దీనికి కూడా సభ్యులు దీటైన బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్‌ ఆస్తుల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్‌ బోర్డు సమావేశానికి గైర్హాజరైనట్టు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు సభ్యుడు ఎండీ రుహుల్లా ప్రకటించారు. మల్లాయపాలెం, చినకాకానిలోని వక్ఫ్‌ భూములను ఏపీఐఐసీకి అప్పగించేలా సమావేశ అజెండాలో పేర్కొనడాన్ని నిరసిస్తూ సమావేశానికి సభ్యులు హాజరు కాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement