పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి | PG medical student dies under suspicious circumstances | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

Feb 6 2026 5:21 AM | Updated on Feb 6 2026 5:21 AM

PG medical student dies under suspicious circumstances

ఆపరేషన్‌ థియేటర్‌లోనే కుప్పకూలి మృత్యువాత

విజయవాడ జీజీహెచ్‌లో ఘటన

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్‌ థియేటర్‌లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్‌ బత్తుల దీపిక(26) అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఆమె బుధవారం ప్రభుత్వాస్పత్రి ‘సీ’ బ్లాక్‌లోని జనరల్‌ సర్జరీ ఆపరేషన్‌ థియేటర్‌లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్‌ డ్యూటీలో ఉన్నారు. 

ఆమె రాత్రి పది గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్‌ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డాక్టర్‌ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లు ఉన్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్‌ ఇంజక్షన్‌ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం డాక్టర్‌ దీపిక ఆపరేషన్‌ థియేటర్‌ చాంబర్‌లోని రూమ్‌లో ఉండగా, మరో విద్యార్థి 1.10 గంటల సమయంలో సర్జరీకి కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. 

ఆమె తిరిగి 1.40 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌ చాంబర్‌కు వచ్చి చూడగా, డాక్టర్‌ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్‌కు వెళ్లగా, డాక్టర్‌ దీపిక ఒక మూలన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలించగా, అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్‌ఐసీయూకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. కాగా, డాక్టర్‌ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితోపాటు తల్లి భారతి కూడా వైద్యశాఖలో పని చేస్తున్నారు. సోదరి డాక్టర్‌ మౌనిక హైదరాబాద్‌లో గైనకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.   

మృతికి తెలియని కారణం 
తొలుత హార్ట్‌ అరెస్ట్‌ కారణంగా డాక్టర్‌ దీపిక మృతిచెంది ఉండవచ్చని సహచరులు, వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజక్షన్‌ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజక్షన్‌ వికటించి మరణించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవీ ఇచ్చినప్పుడు హార్ట్‌ అరెస్ట్‌ కావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కాగా, డాక్టర్‌ దీపిక నోటి వెంట నురగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండటం, మరోచోట బ్యాండెడ్‌ వేసి ఉండటంతో ఆమె ఇంకా వేరే ఇంజక్షన్‌ ఏమైనా చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అయితే, ఆమెకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి 1.10 గంటల వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్‌ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్‌ థియేటర్‌కు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. 

బుధవారం రాత్రి వైద్యులు మినహా బయటి వ్యక్తులు ఎవరూ ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్‌ దీపిక తన రూమ్‌ నుంచి థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. డాక్టర్‌ దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement