ఆపిన పనులు రెండు నెలల్లో మళ్లీ మొదలు పెట్టాలి
లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుంది
చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ‘చలో పోతిరెడ్డిపాడు’ సభ అల్టిమేటం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాల్సిందేనని తీర్మానం
ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా గ్రేటర్ రాయలసీమలో నిరసన సభలు నిర్వహిస్తామని వెల్లడి
తెలంగాణ సీఎంతో కుమ్మక్కై బాబు ‘సీమ’కు ద్రోహం చేశారని నేతల మండిపాటు
వైఎస్సార్ కృషి వల్లే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంపు
‘సీమ’కు మరింత మేలు జరిగేలా వైఎస్ జగన్ హయాంలో ‘లిఫ్ట్’కు శ్రీకారం
జగన్‌కు పేరొస్తుందని కుట్ర పూరితంగా పనులు ఆపించిన చంద్రబాబు
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్‌ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. 
చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు
‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు
40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్‌తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్‌రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్‌రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు.
ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్‌కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్‌తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు
– సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్
రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు
కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్‌దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్
ఏకతాటిపై పోరాడుదాం
1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్‌తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి
తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్‌కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం.
– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి
చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు
రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు.
– బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం
వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి.
– ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే
ఎన్‌జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు:
నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్‌జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు.
– దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్‌చార్జి
రాయలసీమకు చంద్రబాబు ద్రోహం
రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది.
– అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే
తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది
‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు.
– సాకె శైలజానాథ్, మాజీ మంత్రి
ఓటుకు కోట్లు కేసుకు భయపడే..
రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్‌కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి.
– ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు
గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన
శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్‌మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.
– తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు
లిఫ్ట్‌తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు
ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్‌తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం.
– రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందాం
రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్‌్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
– బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు
బాబు కుట్రలను అంతం చేద్దాం
రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం.
– గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ
ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం
సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం.
– భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు
ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం
రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం.
– కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు


