నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం.. | Netzines Social Media Trolling On Pawan and Nagababu | Sakshi
Sakshi News home page

నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..

Feb 5 2026 7:07 PM | Updated on Feb 5 2026 8:05 PM

Netzines Social Media Trolling On Pawan and Nagababu
  • సరిపోయారు ఇద్దరూ..
  • బాబు చెప్పినట్లు ఆడుతున్న పవన్ నాగబాబు
  • లడ్డులో కొవ్వు గురించి నాలుక మడతేసిన పవన్
  • తాను అసలైన హిందూను అంటూ నాగబాబు కొత్తరాగం
  • సోషల్ మీడియాలో ఇద్దరిపైనా ట్రోలింగ్ వరద

కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్‌గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.

దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి  పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్‌ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్‌ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్‌కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  
-సిమ్మదిరప్పన్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement