అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? | Chandrababu Pawan Kutami Sarkar New Drama In Tirumala Laddu Row | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా?

Feb 5 2026 3:43 PM | Updated on Feb 5 2026 3:52 PM

Chandrababu Pawan Kutami Sarkar New Drama In Tirumala Laddu Row

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్‌, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్‌మీట్‌తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్‌ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు.  

మీడియాపై చంద్రబాబు అసహనం
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని..  కూటమి సర్కార్‌ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. 

ఊగిపోయిన పవన్‌
జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్‌సీపీ నేతలకు క్లీన్‌ చిట్‌(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్‌.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ముందే చెప్పిన వైఎస్‌ జగన్‌
చంద్రబాబు ఏకసభ్య కమిషన్‌ డ్రామా గురించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్‌ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్‌ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్‌ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్‌ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement