ఈ టైంలో బాబు-పులి కథ చెప్పాల్సిందే! | Byreddy Siddharth Reddy Satires Chandrababu With Puli Katha | Sakshi
Sakshi News home page

ఈ టైంలో బాబు-పులి కథ చెప్పాల్సిందే!

Feb 5 2026 2:20 PM | Updated on Feb 5 2026 3:18 PM

Byreddy Siddharth Reddy Satires Chandrababu With Puli Katha

సాక్షి, నంద్యాల: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్లు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వేస్ట్‌ అని మాట్లాడుతున్నారు. మద్ధతు ఇవ్వమని కోరితే.. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అవే చదువుకుని కుంటే ఏ ఇంజినీర్లు అయ్యి ఉండేవాళ్లు కదా. ఇదంతా కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే. 

తెలుగు దేశం వాళ్లు ఒక్క పని చేయరు. చంద్రబాబుకు తెలిసిందల్లా రెండే.. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది పని ఎవరైనా పూర్తి చేశాక వచ్చి తనదే ఆ క్రెడిట్‌ అని చెప్పుకోవడం.. అందుకే ఇప్పుడు వేటగాడి కథ చెప్పుకోవాలి..

ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్‌ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు.  

లడ్డూ గురించి అడిగితే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. యూరియా కొరత గురించి అడిగితే.. ఆ వాడకం మంచిది కాదు కేన్సర్‌ వస్తుందటారు. మహిళలకు ఎన్నికల్లో ఇస్తానన్న భృతి గురించి అడిగితే.. నా దగ్గర భద్రంగా ఉంటుందని అంటున్నారు. ఇంక పవన్‌ కల్యాణ్‌ తిరిగేది రెండు మూడు నియోజకవర్గాలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. చంద్రబాబు అండ్ కో పదే పదే అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ చంద్రబాబు జాగీరు కాదని.. మెడలు వంచైనా సరే సాధించుకుంటామని ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా , రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement