ప్రతి పిటిషన్‌పై మళ్లీ మినీ ట్రయల్‌ నిర్వహించలేం | Supreme Court key orders on Sunithas petition in YS Viveka case | Sakshi
Sakshi News home page

ప్రతి పిటిషన్‌పై మళ్లీ మినీ ట్రయల్‌ నిర్వహించలేం

Feb 6 2026 4:26 AM | Updated on Feb 6 2026 4:26 AM

Supreme Court key orders on Sunithas petition in YS Viveka case

వైఎస్‌ వివేకా కేసులో సునీత పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు 

ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూపోతే ఈ కేసు అంతులేకుండా ముందుకు వెళుతుంది 

ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు చేయాలి.. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయండి.. 

ఎవరిని విచారించాలన్న దానిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతి అంశంపై మళ్లీ మళ్లీ ‘మినీ ట్రయల్స్‌’నిర్వహించడం సాధ్యం కాదని, దర్యాప్తును వేగంగా ముగించాలని జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం సీబీఐని గురువారం ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటే అది అంతులేకుండా పోతుందని, న్యాయం జరగడంలో జాప్యం అవుతుందని హెచ్చరించింది.  

ఇలాగే సాగదీస్తే మూడు నాలుగేళ్లు పడుతుంది.. 
వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సునీతారెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ ట్రయల్‌ కోర్టు కేవలం ఒక నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు సాగదీతపై ఘాటుగా స్పందించింది. ‘ప్రతి పిటిషన్‌పై మేం మినీ ట్రయల్‌ నిర్వహించలేం. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసు అంతులేకుండా ముందుకు వెళుతుంది. 

ఇలాగే విచారణను సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడమే అవుతుంది’అని జస్టిస్‌ సుందరేష్‌ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘ఈ కేసులో ప్రధాన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అదనపు విచారణ కొనసాగిస్తున్నాం. కేసును ఒక ముగింపు దిశగా తెచ్చే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని నివేదించారు. 

నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు పేరుతో విచారణను సాగదీస్తున్నారని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్లు తమ వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని సీబీఐకి అందజేయవచ్చని సూచించింది.  

ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం...  
దర్యాప్తును ఒక నెల కాలపరిమితిలోగా ముగించాలన్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ట్రయల్‌ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఎవరిని విచారించాలి? ఎవరిని అదుపులోకి తీసుకోవాలి? అనే అంశాలపై మేం ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోం. అది పూర్తిగా దర్యాప్తు సంస్థ విచక్షణకు సంబంధించిన విషయం. ట్రయల్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగడమే ముఖ్యం. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ. కొత్త నిజాలు తెలిసినప్పుడు వాటిని విస్మరించలేం. 

దర్యాప్తు సంస్థపై కాలపరిమితి పేరుతో అనవసరమైన ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి’అని పేర్కొంది. ట్రయల్‌ కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ, సీబీఐ తన విధి నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చని పేర్కొంది. సుమారు 13,16,964 ఫైళ్లతో కూడిన సమాచారాన్ని, హార్డ్‌ డిస్క్‌లను విశ్లేషించాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టు దృష్టికి తెచ్చింది. 

ఇంత భారీ స్థాయిలో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి సమయం పడుతుందని, అందుకే గడువు విషయంలో వెసులుబాటు కల్పించాలని సీబీఐ కోరింది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పష్టతనిస్తూ, కాలయాపన చేయకుండా కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement