‘లడ్డూ’పై విచారణకు కమిషన్‌! | Chandrababu Government Decides To Set Up New Commission For Inquiry Into TTD Ghee Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

‘లడ్డూ’పై విచారణకు కమిషన్‌!

Feb 4 2026 5:14 AM | Updated on Feb 4 2026 2:11 PM

Commission to investigate the Tirumala Srivari Laddu

మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల. చిత్రంలో మంత్రులు పార్ధసారధి, నాదెండ్ల

జంతు కొవ్వు లేదని ఇప్పటికే ‘సుప్రీం’ నియమించిన సీబీఐ తేల్చేసినా.. మళ్లీ విచారణ కమిషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్‌ దర్యాప్తులో వెల్లడికావడం.. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ న్యాయస్థానంలో దర్యాప్తు సంస్థ చార్జిషీట్‌ దాఖలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. చార్జిషీట్‌లో అప్పటి టీటీడీ పాలకమండలి చైర్మన్‌ సహా కమిటీ సభ్యులందరినీ చేర్చడంపై సుదీర్ఘంగా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇప్పటికే అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసినందున ఇక ‘సిట్‌’ పరిధి ముగిసిందనే నిర్ణయానికి వచ్చిన మంత్రివర్గం దీనిపై తదుపరి విచారణకు ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది.

అయితే స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్‌ దర్యాప్తు నివేదిక వచ్చాక కూడా మళ్లీ విచారణ కమిషన్‌ ఎందుకని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సీబీఐ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసినందున విచారణ పరిధి ముగిసిందని భావిస్తున్నట్లు మంత్రి కేశవ్‌ చెప్పారు. ‘అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో సహా కమిటీ సభ్యులందరినీ నేరస్తులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సీబీఐ సిట్‌ తన లేఖలో చర్యలు తీసుకోవాలని ప్రస్తావించిన అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు స్వల్పకాలిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భోలే బాబా 2019 ఏప్రిల్‌లోనే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ అది ఎన్నికల సమయం’ అని మంత్రి కేశవ్‌ పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్ధసారధితో కలసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు.

చార్జిషీట్‌లో లోపాలపై చర్చించాం: మంత్రి పయ్యావుల
టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాట్లాడారు. ఎన్‌డీడీబీ అనుమానిత రిపోర్టు ఆధారంగానే సీఎం మాట్లాడారు. అయితే ఆ రోజు ఎన్‌డీడీబీ రిపోర్టు ఉందని సీఎం చెప్పలేదు. ఎన్‌డీడీబీ తన రిపోర్టులో ‘ఎస్‌’ విలువలో హెచ్చుతగ్గులున్నందున జంతు కొవ్వు అవశేషాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దాని ఆధారంగానే సీఎం మాట్లాడారు. నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిట్‌ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో లోపాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం.

2022లోనే నెయ్యి కల్తీ జరిగినట్లు నివేదిక ఉన్నప్పటికీ అప్పటి టీడీటీ చైర్మన్‌ సహా కమిటీ సభ్యులెవరూ చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కి­పెట్టారు. అంతకు ముందే నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను సడలించారు. దీన్నిబట్టి మొత్తం కమిటీ సభ్యులకు తెలిసే దురుద్దేశపూర్వకంగా నెయ్యి కల్తీకి పాల్పడ్డారని ప్రభు­త్వం భావిస్తోంది. సీబీఐ చార్జిషీట్‌ను కోర్టు ఇంకా అధికారికంగా స్వీకరించలేదు. అధికారికంగా స్వీకరిస్తే గానీ అందులో ఎవ­రున్నారు? ఎవరిని చేర్చలేదనేది తెలియదు. చార్జిషీట్‌లో లోపా­లుంటే కోర్టు వెనక్కు పంపించే అవకాశం ఉంది. సప్లి­మెంటరీ చార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యుల పేర్లు లేకపోతే వారిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ను మంత్రివర్గ భేటీకి పిలిచి సలహా కోరాం. 

కల్తీ నెయ్యి గురించి ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్లాలని డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మంత్రివర్గ సమావేశంలో సూచించారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఎన్‌డీడీబీ రిపోర్టు ఆధారంగా నిజాయతీగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారన్నారు. కల్తీ నెయ్యి గురించి 2022లోనే నివేదిక వచ్చినా జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ రిపోర్టు ఆధారంగానే సీఎం చంద్రబాబు చెప్పారని, బోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలియాలని మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. టీటీడీ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ తనను కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్‌రెడ్డి, భాస్కరరెడ్డిని పిలిచేవారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement