రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును
నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ.. ‘లడ్డూ’పై బాబు మళ్లీ సొంత విచారణ
దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని దుస్సంప్రదాయానికి నాంది
శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం
తమకు అనుకూలంగా, కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం
తద్వారా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే నిర్ధారించిన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబొరేటరీలు
అదే విషయాన్ని తన చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ సిట్
కుట్రలు బెడిసికొట్టడంతో బాబు సర్కారు న్యాయ ధిక్కారం
లడ్డూపై మళ్లీ దర్యాప్తునకు సొంతంగా విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం
మంత్రివర్గ సమావేశం వేదికగా నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘన
సుప్రీంకోర్టు అధికార పరిధిని సవాల్ చేసిన బాబు సర్కారు
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్‌లు ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.
తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు.
లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. 
తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్‌లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం
సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపు
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు.
అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్‌ను నియమించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది.
ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది.
ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.
కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...
సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్‌షీట్‌లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌లతో సమావేశమై చార్జ్‌షీట్‌లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు.
ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్‌షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.
జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..
చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌డీఆర్‌ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది.
ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.
జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.
నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!
రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు.
అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్‌ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌కు చీఫ్‌గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు.
పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!
సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు.
ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్‌కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు.


