రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా? | Sakshi Guest Column On Chandrababu Govt Rayalaseema Lift Scheme Works | Sakshi
Sakshi News home page

రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?

Feb 4 2026 12:29 AM | Updated on Feb 4 2026 12:58 AM

Sakshi Guest Column On Chandrababu Govt Rayalaseema Lift Scheme Works

నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు

కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్‌తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్‌  ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.

వాటా జలాలను వాడుకోవడానికే...
కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్‌ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! 

శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్‌ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. 

వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. 

ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్‌ పాలసీ!
శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్‌మోహన్‌ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్‌ జగన్‌కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్‌నగర్‌ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. 

సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్‌సీపీ సర్కార్‌ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్‌ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్‌సీపీ సర్కార్‌ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే...  పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. 

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్‌  12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్‌డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్‌గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్‌ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.
 
ఇక బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్‌ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేసేది.

పోలవరం రిజర్వాయర్‌ కాదు బ్యారేజే!
గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్‌  11 నాటికే స్పిల్‌ వేను అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్‌ సర్కార్‌కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్‌ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్‌ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. 

పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్‌ను బ్యారేజ్‌గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. 

ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2ను 2004 దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్‌ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్‌ 9న నాటి సీఎం వైఎస్‌ జగన్‌  ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్‌  పట్నాయక్‌తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్‌  12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్‌ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.
– ఆర్‌.జి.ఆర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement