మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్‌లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్‌ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్‌దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!
బడ్జెట్‌లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్‌ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్‌లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్‌లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్‌కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.
అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్‌లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్‌లో కొత్త ముఖం. ముక్కులు
పిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్‌లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్‌లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.
ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్‌పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.
అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.
నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్‌మెంట్‌లు, పబ్లిక్ అసెట్‌ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.
నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్‌కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది!


