అంతా ప్రైవేటు రూటే! | Sakshi Guest Column On Union Budget, Private sector by Telakapalli Ravi | Sakshi
Sakshi News home page

అంతా ప్రైవేటు రూటే!

Feb 2 2026 12:45 AM | Updated on Feb 2 2026 12:45 AM

Sakshi Guest Column On Union Budget, Private sector by Telakapalli Ravi

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వంటివారు కార్మికులపై విరుచుకుపడ్డారుగానీ బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రకటనలేమీ చేయించలేక పోయారు. అసలు కూటమిలో ఉండటం వల్ల ఏపీకి ఏమి తీసుకురాగలిగారంటే శూన్యమే!

సందర్భం

ఈ ఏడాది బడ్జెట్‌లో అమెరికా టారిఫ్‌ల తాకిడిని తట్టుకోవడంపై దృష్టిని కేంద్రీకరించినట్టు కేంద్రం చెబుతూనే వారితో ఒప్పందానికి తలుపులు తీసి ఉంచింది. ఈయూతో ఒప్పందం కూడా చాలా విధాలుగా మన దేశీయ ఉత్పత్తులను, వ్యాపారాలను దెబ్బ తీస్తుంది. అంతర్జాతీయంగా చాలా ఆర్థికాంశాలు మన అధీనంలో లేకుండాపోయాయంటూ ఆర్థిక సర్వేలోనే  కేంద్రం మూడు అవకాశాలు సూచించింది. అధ్వాన్నమైన పరిస్థితి వస్తే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండొచ్చని కూడా పేర్కొంది. 

మరి బడ్జెట్‌లో స్వావలంబన కోసం ఏవైనా నిర్మాణాత్మక పథకాలున్నాయా అంటే చాలా భాగం విదేశాలతో ముడిపడిన ప్రైవేటు ప్రాజెక్టులే. అన్నీ ప్రైవేటుకు అప్పగించే పీపీపీ నమూనా దీనంతటి వెనక దాగి ఉంది. ఆర్థిక సర్వేలోనే కేంద్రం ప్రైవేటు రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో సర్కారుకు 51 శాతం వాటా ఉండాలనే విధానాన్ని మార్చి... 26 శాతం ఉంటే సరిపోతుందని సూచించింది.      

ఆర్థిక అంచనా ఆందోళన కరంగా ఉంటే ముందు ఆదుకో వలసింది పేద, మధ్య తరగతి వర్గాలను! కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరిట వారికి ఇచ్చే సంక్షేమ పథకాలనే నిర్మలమ్మ టార్గెట్‌గా చేసుకున్నారు.  2025–26లో పన్ను ఆదాయం ఆశించిన మేర కైనా పెరిగింది లేదు. 2026– 27కు చూపించిన అంచనాలు 2025–26 స్థాయిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం. కార్పొరేట్‌ రంగానికి లక్షల కోట్ల రాయితీల వల్ల గండి కొనసాగించారు. పీఎమ్‌ పోషణ్, పీఎమ్‌శ్రీ, పంటల బీమా వంటి వాటన్నిటికీ కేటాయింపుల్లో కోత వేశారు. 

మహిళల కోసం ఉద్దేశించిన నిధులలో 51,444 కోట్లు కోత పెట్టారు. 2026–27లో ఎరువులు, ఆహారం, పెట్రోలియం, సబ్సిడీ లలో మరింత కోత ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమం ప్రధానంగా భావించకపోవడం వల్లనే నగదు బదిలీలు 1.7 కోట్లు దాటిపోతున్నాయని సర్వేలోనే ఆందోళన వెలిబుచ్చింది. గిగ్‌ వర్కర్ల జీతాలు పెరVýæక పోవచ్చని కూడా సర్వేలోనే  వెల్లడించింది. కొత్త లేబర్‌ కోడ్‌లు, పనిగంటల పెంపు వంటివన్నీ కలిపి చూసుకుంటే ఏలినవారు ఏ దిశలో ఆలోచించారో తెలుస్తుంది. ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే.

ఏఐ డేటా సెంటర్లకు, క్లౌడ్‌ కంపెనీలకు 2047 దాకా భారీ రాయితీలు ప్రకటించింది. కంటైనర్లపై, విమాన తయారీ పరికరాలపై రాయితీలు కూడా కార్పొరేట్లకే కానుక లవుతాయి. ఇన్‌ఫ్రా రంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులకు ఆధారమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అరుదైన మృణ్మయ నమూనాలపై ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడి కన్నుపడింది గనక ఏపీలోనూ అలాటి ఒక పరిశోధనా కేంద్రం నెలకొల్పు తామన్నారు. ఈనగాచి నక్కల పాలైనట్టు ఇవన్నీ తర్వాత ప్రైవేటు బాటలోకి తరలించబడతాయి. రక్షణ రంగం కేటా యింపుల పెంపు కూడా ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఖర్చయి పోతుంది. అప్పుల శాతం జీడీపీలో 50 శాతానికి తగ్గించడం లక్ష్యమైందంటే పరిస్థితి తెలుస్తోంది. 

ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించవలసిన రాష్ట్రాలు ఎంత మొరపెట్టుకున్నా వాటి కేటాయింపుల పెంపు లేదు. 16వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ గత ఏడాది ఇచ్చిన 41 శాతం వాటాను  కొనసాగించ డమే గొప్ప వరంగా బడ్జెట్‌ చిత్రించింది. 2025–26 బడ్జె ట్‌లో చెప్పినదానితో పోలిస్తే ఆచర ణలో కేంద్ర పథకాలు, ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లు, ఇతర బదలా యింపుల కింద వచ్చే మొత్తం రాష్ట్రాల వాటాకు రూ. 2,03,801 కోట్లు కోత పడింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు రాష్ట్రాలపై ముందే వేటు వేసింది. ‘వీబీ జీ రామ్‌ జీ’ – కింద మరింత తగ్గింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆదుకో వడానికి ముందుకు రాకపోవడం దారుణం, విభజిత రాష్ట్రమైన ఏపీ వంటి వాటిని తీసుకుంటే... ఒక్కటంటే ఒక్క పథకం కింద కూడా నిధులు ఇవ్వలేదు. 

పోలవరం నిర్మాణానికి కేటాయింపు రూ. 3000 కోట్లు తగ్గించారు. నిర్వాసితులకు అవసరమైన 21 వేల కోట్లలో ఎంత ఇచ్చేదీ పేర్కొనలేదు. అమరావతి గురించి అప్పుల గొప్పలు చెప్పడం తప్ప సహాయం ఊసే లేదు. విశాఖ ఉక్కుపై ముఖ్య మంత్రి చంద్రబాబు వంటి వారు కార్మికులపై విరుచుకుపడ్డారు గానీ బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రకటనలేమీ చేయించలేక పోయారు. అసలు కూటమిలో ఉండటం వల్ల రాష్ట్రానికిఏమి తీసుకురాగలిగారంటే శూన్యమే! అలాగే తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కోరిన అంశాలేవీ చోటు సంపాదించ లేకపోయాయి. కనుక ఏ విధంగా చూసినా నిర్మలమ్మ బడ్జెట్‌ నిస్సారమైన, నిరుత్సాహ కర వ్యవహారం. పైగా బడ్జెట్‌లో చూపించకుండా తర్వాత పన్ను పెంచడం ఇటీవలి రివాజు గనక పారా హుషార్‌!

తెలకపల్లి రవి 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Advertisement
 
Advertisement
Advertisement