ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు | case file against Railway Kodur MLA Arava Sridhar | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు

Feb 3 2026 6:32 PM | Updated on Feb 3 2026 6:58 PM

case file against Railway Kodur MLA Arava Sridhar

సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేసింది. 

అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

‘చర్యలుండవ్‌’ అంటూ
లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్‌ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్‌’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.

కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.

Advertisement
 
Advertisement
Advertisement