శ్రీవారి పేరుతో జగన్‌పై కుట్ర | YSRCP Bhumana Karunakar Reddy Serious On CBN Govt Over Srivari Laddu | Sakshi
Sakshi News home page

శ్రీవారి పేరుతో జగన్‌పై కుట్ర

Feb 6 2026 5:35 AM | Updated on Feb 6 2026 5:35 AM

YSRCP Bhumana Karunakar Reddy Serious On CBN Govt Over Srivari Laddu

తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా బాబు, పవన్‌ ప్రవర్తన

ఏళ్ల తరబడి వ్యవస్థలను వాడుకోవడం బాబుకు అలవాటు

ఇవాళ తన రాజకీయం కోసం దేవుడ్నీ వదలకుండా కుతంత్రం

సిట్‌ నివేదికతో అడ్డంగా దొరికిపోయినా ఇంకా నెయ్యిపై దుష్ప్రచారం

ఆత్మరక్షణలో పడి కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యం చేస్తున్న సీఎం

స్వామివారి విశేష సేవలో వైఎస్సార్, వైఎస్‌ జగన్‌

అయినా వైఎస్సార్‌ కుటుంబంపై పచ్చి అబద్ధాలు

చంద్రబాబు, పవన్‌ తీరుపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఫైర్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దైవ ద్రోహం పేరుతో వైఎస్‌ జగన్‌పై కుట్రకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్‌ తేల్చిచెప్పినా చంద్రబాబు అబద్ధాలు, దుష్ప్రచారం ఆగడంలేదని మండిపడ్డారు. భూమన ఇంకా ఏమన్నారంటే..

అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు..
గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ ప్రజలకు దొరికిపోయామన్న భావన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ సిట్‌ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఇప్పుడు కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడు. గత పదేళ్లలో పవన్‌కళ్యాణ్‌ అనేకసార్లు ‘నేను బాప్టిజమ్‌ తీసుకున్నాను. మా నాన్న దేవుడి దీపంతోనే సిగరెట్‌ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను’.. అంటూ చెప్పాడు. ఆయన ఇవాళ సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. 

ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. 
తన హయాంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్‌ దేవాలయాలన్నీ నాశనం చేశాడంటున్నారు. నిజానికి.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం, మాంసాలు దొరికాయి. బిర్యానీలు తింటూ, తాగి గొడవలు చేస్తూ పట్టుబడ్డారు. కొద్దిరోజుల కిందటే మద్యం బాటిళ్లు విచ్ఛలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. బాబు హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 

అయోధ్య లడ్డూల పైనా అబద్ధాలు..
పవన్‌కళ్యాణ్‌ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయాన్ని ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడానని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారుచేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు.. మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్‌ బోరా రూ.30 లక్షల విలువైన నెయ్యి డొనేషన్‌తో తయారుచేసి అయోధ్యకి పంపించారు. పవన్‌కళ్యాణ్‌ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వైవీ సుబ్బారెడ్డే సీఎఫ్‌టీఆర్‌ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్‌ లేకుండా అపవాదులు వేస్తున్నారు. 

అడ్డంగా దొరికిపోవడంతో ఏకసభ్య కమిషన్‌తో కుట్ర..
ఇక సీబీఐ సిట్‌ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీంతో వారు అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్‌ అంటున్నారు. ఇది మమ్మల్ని ఎలాగైనా నేరస్తుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్‌ డెయిరీ 2014–19 వరకు 80 శాతం మేర మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసింది. 

క్షమాపణ చెప్పాల్సిందే..
మేం తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ సిట్‌ మమ్మల్ని దోషులుగా నివేదికలో పేర్కొనలేదు. అయినా మాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్న మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం కూడా చెబుతున్నాడు. అయితే, 2007 మే 12న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీఓ ఇచ్చారు. ఈ నిజాలన్నింటినీ దాచి చంద్రబాబు మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతిపెద్ద కుట్రకు తెగబడుతున్నాడు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు.

శ్రీవారి విశేష సేవలో వైఎస్సార్, జగన్‌..
వాస్తవానికి.. వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ చేసిన దైవసేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం.

కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటుచేసింది, నాద నీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేదఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. 

వైఎస్‌ జగన్‌ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు.. 
అంతేకాదు.. ఇవాళ మేం కొత్తగా ఐదు వేల ఆలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి.. వైఎస్‌ జగన్‌ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3,500 ఆలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్‌కు సంబంధించిన సంస్థకు అప్పగించాం. మా హయాంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు ఇవాళ అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్‌కళ్యాణ్‌ డబ్బులిప్పించారు. జమ్మూకశ్మీర్‌లోనూ, నవీ ముంబై, విశాఖలో శ్రీవారి ఆలయాలను వైఎస్‌ జగన్‌ నిర్మించారు. చెన్నైలో పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. కానీ, మీరు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు హోటల్‌కి కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఎందుకని ప్రశ్నించారు. మీరెన్ని అభాండాలు వేసినా  వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదు.

కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకు నెయ్యి అద్దింది మీరే..
భోలేబాబాను చంద్రబాబు 2018లోనే రప్పించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగోలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్ధమా? ఇక 2018 ఫిబ్రవరిలో లడ్డూలకు వాసన రావడానికి మీరు రోజుకు 975 కేజీల నెయ్యిని రూ.3.87 కోట్లకు కొన్నారు. (ఆధారాలు చూపించారు). అంటే.. మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేయడంవల్ల అవి వాసన రాకుండా వాటిపై మళ్లీ నెయ్యి అద్దడం కోసమే రూ.3.87 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలోనే జరిగిన విషయం. కొద్దిమంది అవినీతి అధికారులు, మీ హయాంలో మీరు ఏర్పాటుచేసిన టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన నేరాన్ని సిట్‌ బయటపెట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement