వీసా ఆంక్షలతో వెనక్కి తగ్గిన ఆఫ్రికా దేశాలు  | Namibia, Angola, and DRC agree to UK migrant returns after visa threats | Sakshi
Sakshi News home page

వీసా ఆంక్షలతో వెనక్కి తగ్గిన ఆఫ్రికా దేశాలు 

Feb 7 2026 6:25 AM | Updated on Feb 7 2026 6:25 AM

Namibia, Angola, and DRC agree to UK migrant returns after visa threats

యూకేలో అక్రమ వలసదారులుగా ఉన్న తమ పౌరులను తీసుకెళ్లేందుకు అంగీకారం 

లండన్‌: వీసాలను నిలిపివేస్తామంటూ యూకే హోం శాఖ చేసిన బెదిరింపులతో ఆఫ్రికాలోని మూడు దేశాలు వెనక్కి తగ్గాయి. యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన, ఇతర నేరాలకు పాల్పడిన వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ దేశాలు సమ్మతిని తెలిపాయి. ఈ విషయాన్ని యూకే హోం శాఖ శుక్రవారం తెలిపారు. నమీబియా, అంగోలాలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. 

పౌరులకు కోసం ఫాస్ట్‌ట్రాక్‌ వీసా ప్రాసెసింగ్‌ విధానాన్ని రద్దు చేయడంతోపాటు ఆ దేశం నుంచి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక వీసా సౌకర్యాలను రద్దు చేస్తామంటూ హెచ్చరించడంతో డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(డీఆర్‌సీ) తాజా తమ దారికి వచ్చిందని హోం మంత్రి షబానా మహ్మూద్‌ చెప్పారు. విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన పక్షంలో తగు పర్యావసానాలను ఎదుర్కొనక తప్పదన్నారు. 

అక్రమ వలసదారులు, ప్రమాదకరమైన నేరగాళ్లను పట్టుకుని, అంగోలా, నమీబియా, డీఆర్‌సీలకు పంపించివేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, సొమాలియా, గబోన్‌ వంటి దేశాలు ఈ రకమైన ఒప్పందానికి వ్యతిరేకత చూపుతున్నందున, వాటిపైనా వీసా సంబంధిత ఆంక్షలు విధిస్తారంటూ వస్తున్న వార్తలపై ఆమె నేరుగా స్పందించలేదు. యూకేలో 2025 జూలైలో లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 58 వేల మంది అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించి వేసింది. తాజాగా, మూడు ఆఫ్రికా దేశాలతో కుదిరిన ఒప్పందం ఫలితంగా మరో 3 వేల మందిని ఆయా దేశాలకు తిప్పిపంపే అవకాశాలున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement